● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: వన మహోత్సవంలో శాఖల వారిగా కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వన మహోత్సవంపై డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా 25లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, వివరాలను అటవీశాఖ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌ఓ వసంతకుమారి, ఆర్డీఓ హరిక్రిష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీలను త్వరగా పరిష్కరించాలి..
ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 65మంది నుంచి కలెక్టర్ స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు.
కలెక్టర్‌ను కలిసిన డీటీఓ శ్రీనివాస్..
జిల్లా రవాణాశాఖ అధికారిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన బి.శ్రీనివాస్ ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇక్కడ డీటీఓ విధులు నిర్వహిస్తున్న వెంకన్న ఈ నెల 22న జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో బి.శ్రీనివాస్‌ను భూపాలపల్లి డీటీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ 56 శాతం పూర్తి..
స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ జిల్లాలో 56 శాతం పూర్తయినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియపై సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల ఎన్నికల, సహాయ ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు.


