● కాగితాల్లో చంపేశారు..పింఛన్ ఆపేశారు!
మల్హర్: అధికారుల నిర్లక్ష్యానికి, వ్యవస్థలోని లోపాలకు ఓ నిరుపేద వృద్ధురాలు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కండ్లముందే తిరుగుతున్న ఓ వృద్ధురాలిని రికార్డుల్లో చంపేసిన అధికారులు.. ఆమెకు వస్తున్న ఏకై క ఆధారమైన పెన్షన్‌ను తొలగించారు. రికార్డుల నిర్వహణలో దొర్లిన ఒక పెద్ద తప్పిదం ఓ వృద్ధురాలి జీవనాధారాన్ని దెబ్బతీసింది. నేను బతికే ఉన్నా.. అంటూ ఆ వృద్ధురాలు కన్నీటి పర్యంతమవుతోంది.
వృద్ధురాలి కథనం ప్రకారం.. మల్హర్ మండలం కొండంపేట గ్రామ పంచాయతీ పరిధి గట్టుపల్లె గ్రామానికి చెందిన గోరేటి పార్వతికి 68 సంవత్సరాలు. వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఐదు నెలలుగా పింఛను నిలిచిపోయింది. చనిపోయినట్లు చూపించి పెన్షన్ ఆపేశారు. దీంతో మార్చి 20వ తేదీన కార్యదర్శికి పెన్షన్ వస్తలేదని దరఖాస్తు పెట్టుకుంది. దీంతో రోజు గడవడం కష్టంగా ఉంది అని పార్వతి కన్నీటి పర్యంతమైంది. సాంకేతిక కారణాలతో ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. పెన్షన్‌ను పునరుద్ధరించాలని వృద్ధురాలు వేడుకుంటుంది.


