గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన తరువాత స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
బాధ్యతలు స్వీకరించిన జీవన్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జె.జీవన్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు న్యాయవాదులు, న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్రకళ నుంచి బాధ్యతలను స్వీకరించిన జీవన్‌కుమార్‌కు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి.కన్నయ్యలాల్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రాములు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, అడిషనల్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్‌కు డేంజర్ జోన్ నిర్వాసితుల వినతి
మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌కు 500మీటర్ల దూరంలో ఉన్న పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ ఇండ్ల సేకరణ నిమిత్తం సర్వే చేయించాలని సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మకు డేంజర్ జోన్ నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డేంజర్ జోన్ ఇండ్ల సేకరణలో భాగంగా కాటారం ఆర్డీఓ ద్వారా భూములు, ఇండ్లకు సర్వే చేయించాలని కలెక్టర్‌ను కోరారు. ఇప్పటికే సేకరణ నిమిత్తం హైదరాబాద్ జోన్‌కో ద్వారా నిధులు కలెక్టర్ ఖాతాలో జమయినట్లు వినతిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, నిర్వాసితులు రాజేశ్వర్‌రావు, రమేశ్, సురేష్‌రావు, సత్యనారాయణ, గట్టయ్య, అజ్మత్ అలీ, చంద్రయ్య పాల్గొన్నారు.
హ్యాండ్లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహణకు అధికారికంగా ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఆరు చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. చికినేపల్లి, రేగొండ, చల్లగరిగె, మొగుళ్లపల్లి, గిద్దెముత్తారం, టేకుమట్ల సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని జిల్లా సహకార శాఖ అధికారి వాల్యానాయక్ సోమవారం ఒక ప్రకటనలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 5న నామినేషన్ల పరిశీలన, 6న ఉపసంహరణలు, 10న ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన ఉంటుందని వాల్యానాయక్ తెలిపారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి సోమవారం 11మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
చిట్యాల: చల్లగరిగ గ్రామానికి చెందిన నోముల సదమ్మ, గులాం జిలాని, జూకల్ గ్రామంలోని తాంపు భద్రయ్య, సౌడ కిషన్ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాలను మధుసూదనాచారి పరామర్శించి ఆర్థికసాయం అందించారు. అనంతరం పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చింతల రమేష్ ముదిరాజ్, రత్న రవి, కన్నెబోయిన అశోక్, జంబుల చంద్రమౌళి ఉన్నారు.


