రిలే నిరాహార దీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

Jun 30 2026 1:12 AM | Updated on Jun 30 2026 1:12 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కోల్‌ మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. జూలై 13 వరకు కొనసాగే ఈ దీక్షల్లో సింగరేణి అధికారులకు వేతన సవరణ అమలు చేయాలని, పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, కోలిండియా అధికారులతో సమానంగా అలవెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, సింగరేణికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో దీక్షలు చేపడుతున్నట్లు సీఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎండీ నజీర్‌ తెలిపారు. వీరి దీక్షలకు జీఎం కార్యాలయ హెచ్‌ఓడీలు, ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి మద్దతు తెలపగా, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో సీఎంఓఏఐ నాయకులు సమ్మిరెడ్డి, విక్రమ్‌, అలీమ్‌, ప్రమోద్‌, సుశాంత్‌, శ్రీనివాస్‌, మౌనిక, షైనీ పాల్గొన్నారు.

రేపు కొత్తగూడెం హెడ్‌ ఆఫీస్‌ ఎదుట ధర్నా

జూలై 1న కొత్తగూడెం హెడ్‌ ఆఫీస్‌ ఎదుట నిర్వహించే ధర్నాకు కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పసునూటి రాజేందర్‌, మోటపలుకుల రమేష్‌, నరేష్‌నేత, దుడ్డేల సాయిలు, జూపల్లి మల్లేష్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడారు. అనేక సమస్యలపై ప్రభుత్వానికి యాజమాన్యానికి అనేకసార్లు కార్మిక సంఘాలు విన్నవించినా సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్‌కుమార్‌, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement