జిల్లాలో సాగు అంచనా (ఎకరాల్లో..)
దుక్కులు సిద్ధంచేస్తున్న రైతులు
భూపాలపల్లి రూరల్: రబీలో వర్షాభావానికి తోడు పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో కుదేలైన రైతులు.. వానాకాలం సాగుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సారి వర్షాలు గతేడాది మాదిరిగా కాకుండా తక్కువగా కురుస్తాయని, స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇటీవల రెండు సార్లు కురిసిన అడపాదడప వర్షాలతో రైతులు సాగుబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా దుక్కులు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు విత్తనాలు సైతం విత్తారు. ఈ మేరకు అధికార యంత్రాంగం స్పందించి నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంతో పాటు సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచాలనే డిమాండ్ రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది.
పత్తికి ప్రాధాన్యం..
జిల్లాలో గతేడాది 91,510 ఎకరాల్లో పత్తి సాగుచేయగా.. ఈ సారి ఇప్పటివరకు 1,06,560 ఎకరాల్లో సాగుకు అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 45వేలు ఎకరాలు సాగు చేశారని, 1,100 ఎకరాలు వరి నార్లు పోసుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పత్తికి మాత్రం ధరలో పెద్దగా ప్రాధాన్యత లేకున్నా పెద్దమొత్తంలో లాభాలు రాకపోయినా పెట్టుబడి మాత్రం వస్తుందనే నమ్మకంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు బాగుండటంతో ఇతర పంటలు సాగుచేసే రైతులు కూడా పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు.
పెరగనున్న మిర్చి సాగు..
రెండేళ్లుగా మిర్చి పంటలకు ఎక్కువగా చీడపీడలు ఆశిస్తున్నాయి. మార్కెట్‌లో మాత్రం క్వింటాల్‌కు మిర్చికి నాణ్యతను బట్టి రూ.20వేల నుంచి రూ45వేలకు పైగా అధిక ధర పలికింది. రైతులు మిర్చి పంట సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో గతేడాది కేవలం 7,700 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేయగా ప్రస్తుతం 20వేల ఎకరాల్లో సాగుకు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మిర్చి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది మిర్చికి అధిక ధర వస్తుందనే నమ్మకంతోనే రైతులు మిర్చి పంట వైపు మొగ్గు చూపుతున్నారు.
వరి 1,09,854
పత్తి 1,06,560
మిర్చి 20,000
మినుములు 90
పెసర 110
కంది 120
మొత్తం 2,36,734
2,36,734 ఎకరాలకు పైగా సాగు
45వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు


