భూపాలపల్లి రూరల్: జిల్లాలోని కొత్త పట్టాదారులైన రైతులు రైతుభరోసా పథకం లబ్ధి పొందడానికి జూలై 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈ విడతలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు. అర్హులైన రైతులు భర్తీ చేసిన రైతుభరోసా దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డ్ జిరాక్స్, కొత్త పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్‌లను ఏఈఓలకు అందజేయాలని సూచించారు. జూలై 30 నుంచి అర్హులైన రైతులకు రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అర్హులైన కొత్త రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కోటగుళ్లలో జడ్జి ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షత్రం కోటగుళ్లలో పరకాల జూనియర్ సివి ల్ జడ్జి శ్రీవల్లి శైలజ ఆదివారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ అర్చకుడు జూపల్లి నాగరాజు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఏకతాటిపైకి రావాలి
భూపాలపల్లి రూరల్: భవిష్యత్ తరాల అభివృద్ధి, సనాతన ధర్మం కోసం హిందువులందరూ ఏకతాటిపైకి రావాలని ఎండోమెంట్ (థార్మిక) సెల్ విభాగం స్టేట్ జాయింట్ కన్వీనర్, జిల్లా ఇన్‌చార్జ్ మాడుగుల రవీందర్ శర్మ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో జిల్లా సెల్ కన్వీనర్ కర్ర జయపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాయ్ చర్చ కార్యక్రమానికి మాడుగుల రవీందర్ శర్మ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని సమాన దృష్టితో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ విభాగం జిల్లా కో కన్వీనర్‌లు నరేందర్ రెడ్డి, సునీల్ చంద్ర, జాయింట్ కన్వీనర్‌లు పండగటి పురుషోత్తం, బండారి రమేష్, శ్రీనివాస్ చార్యులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సబ్ సెంటర్ల పరిశీలన
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఏటూరునాగారం, గంగారం, తదితర సబ్ సెంటర్లను ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్ పరిశీలించారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంతో పాటు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది సూచనలు చేశారు. వైద్య సిబ్బంది వర్షాకాలం ముగిసే వరకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఇంటింట తిరుగుతూ జ్వర పీడితులను గుర్తించాలన్నారు.
ఏజెన్సీలో భారీ వర్షం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలో 9 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అలాగే వాజేడు మండల పరిధిలోని అత్యధికంగా 27.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగును ప్రజలు బోటులో దాటారు. ఇటీవల వర్షాలకు కొండాయి– దొడ్ల మధ్యలో ఉన్న జంపన్నవాగు ఉధృతికి తాత్కాలిక రోడ్డు తెగిపోగా ప్రజల అవసరాల నిమిత్తం మళ్లీ తాత్కాలికంగా రోడ్డు వేశారు. దీంతో కొండాయి, మల్యాల, కొత్తూరు, గోవిందరాజుల కాలనీ ప్రజలకు రాకపోకలను మొదలయ్యాయి.
ఇళ్లలోకి వరదనీరు
జీసీసీ వెనుకాల ఉన్న కొత్తగుడిసెల్లోని ఇళ్లకు నీరు వచ్చి చేరింది.


