పైలట్ కావాలన్న కల.. శిక్షణలోనే కూలిపోయిన విమానం
హసన్‌పర్తి: తల్లిదండ్రులకు అండగా నిలవాలని.. పైలట్‌గా ఉన్నత స్థానానికి చేరుకోవాలని.. కుటుంబాన్ని గర్వపడేలా చేయాలని సుమంత్ కన్న కలలు ఒక్క ప్రమాదంతో ముగిశాయి. ఆకాశాన్ని జయించాలని బయలుదేరిన యువకుడిని.. అదే ఆకాశం శాశ్వతంగా తనలో కలుపుకోవడం అందరినీ కలచివేస్తోంది. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూస్తూ.. ‘ఒకరోజు నేను కూడా ఈ విమానం నడుపుతా అమ్మా’.. అని చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ఆ తల్లి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. పైలట్‌గా తిరిగి వచ్చి తల్లిదండ్రులకు గర్వకారణం కావా ల్సిన ఆ కుమారుడు.. శవపేటికలో వస్తాడనే విషయాన్ని ఆ కుటుంబం ఊహించలేదు. హసన్‌పర్తికి చెందిన ఆడెపు సుమంత్ (21) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో పైలట్ శిక్షణ పొందుతున్న సమయంలో శిక్షణ విమానం భారత కాలమానం ప్రకారం శనివారం కుప్పకూలడంతో మృతిచెందాడు. ఈ వార్తతో కుటుంబంలో, గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
మధ్య తరగతి కుటుంబం నుంచి..
హసన్‌పర్తి మండలం సీతంపేటకు చెందిన ఆడెపు వరలక్ష్మి–చంద్రమోళిది మధ్య తరగతి కుటుంబం. వ్యాపార రీత్యా చంద్రమౌళి కుటుంబం హసన్‌పర్తిలో స్థిరపడింది. చంద్రమౌళి హసన్‌పర్తిలో పెయింట్స్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆడెపు సుమంత్. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత 6నుంచి పదో తరగతి వరకు ఎల్లాపురంలోని ఎస్పీఆర్ పాఠశాలలో చదివాడు. ఇంటర్ ఆల్ఫోర్స్‌లో పూర్తి చేశాడు. పైలట్ కావాలన్నదే సుమంత్ లక్ష్యం. ఇందుకు సంబంధించిన పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందాడు. దక్షిణాఫ్రికాలో శిక్షణ కోసం గతేడాది వెళ్లాడు.
మరో రెండు నెలలైతే..
మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఒక్క ఫోన్‌కాల్‌తో కుప్పకూలిన కుటుంబం
శనివారం వచ్చిన ఒక ఫోన్‌కాల్ ఆ కుటుంబాన్ని శోకసద్రంలో ముంచింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది.. అతను లేడు’అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
గ్రామమంతా శోకసంద్రం
సుమంత్ మరణవార్త తెలియగానే హసన్‌పర్తి గ్రామానికి చెందిన బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అతడి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసినా వారి రోదనలు ఆగడం లేదు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ‘చాలా మంచివాడు.. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.. ఇంత చిన్న వయసులో ఇలా జరగడం బాధాకరం’అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజులు ఆగమంటాళ్లు
సుమంత్ మృతదేహం ఇండియాకు పంపడానికి మరో మూడు రోజుల సమయం పడుతోందని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో
హసన్‌పర్తికి చెందిన ట్రెయినీ పైలట్
సుమంత్ మృతి
రెండు నెలల్లో పెళ్లి చేసుకునేందుకు
ఇండియాకు వస్తానని తెలిపిన యువకుడు
అంతలోనే తీవ్ర విషాదం..
తల్లిదండ్రులకు తీరని శోకం


