భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరాలకు వివిధ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఐటీఐ తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా ప్రవేశాలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రవేశాల్లో ఫిట్టర్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, వర్చువల్ అనాలిస్ట్ డిజైనర్–ఎఫ్‌ఈఎం, సీఎన్‌సీ మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఐటీఐ భూపాలపల్లి కార్యాలయాన్ని, సెల్ నంబర్ 85004 65034ను సంప్రదించాలని సూచించారు.
అవార్డులకు
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ ఈ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ఉపాధ్యాయులు నేషనల్‌అవార్డుటీచర్స్.ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ ద్వారా జూలై 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయస్థాయి గుర్తింపు పొందాలన్నారు.
నాపాకలో పూజలు
చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలో శ్రీ సర్వతోభద్ర ఆది ఏకశిలా శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకుడు పెండెల ప్రభాకరాచార్యులు ఆయనకు ప్రత్యేక పూజలు జరిపించి దేవాలయ విశిష్టతను వివరించారు. ఇలాంటి దేవాలయం ఇంతవరకు ఎక్కడా చూడలేదని, ఆలయం అభివృద్ధి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జయశ్రీ, ఏపీఓ హలీంపాషా, ఈసీ సుధాకర్ ఉన్నారు.
సమన్వయంతో
కార్మికులకు న్యాయం
భూపాలపల్లి అర్బన్: బాండెడ్ లేబర్ వ్యవస్థ నిర్మూలన, కార్మికుల అక్రమ రవాణా నివారణ, కార్మిక సంక్షేమ పథకాల సమర్థ అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది (గవర్నమెంట్ ప్లీడర్) బొట్ల సుధాకర్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఎఫ్‌ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ సంయుక్తంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ, పోలీసు, కార్మిక శాఖల అధికారులు, పారా లీగల్ వాలంటీర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ వినోద్, పలిమెల తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, సీఐ కరుణాకర్‌రావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు దామోదర్, నాయబ్ తహసీల్దార్లు అంజలిరెడ్డి, అబ్దుల్, శ్రీలత, భాస్కర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
యువజన సంఘాల
సమాఖ్య అధ్యక్షుడిగా అనిల్
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర యువజన సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా భూపాలపల్లి పట్టణానికి చెందిన శిరుప అనిల్‌కుమార్‌ను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో అనిల్ కుమార్‌ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు అనిల్‌ను సత్కరించారు.


