భూపాలపల్లి అర్బన్: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లోని పరిపాలన విభాగాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా పరిపాలనా రికార్డులు, సర్వీస్ రిజిస్టర్లు, ఫైళ్ల నిర్వహణ, అధికారిక పత్రాలు, పెండింగ్ అంశాలు, కార్యాలయ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నాణ్యత, కార్యాలయ పనితీరు, ప్రభుత్వ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి సక్రమంగా నిర్వహించాలని, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని, కార్యాలయ నిర్వహణ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కార్యాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.


