మద్యం తాగి వాహనాలు నడపొద్దు | - | Sakshi
Sakshi News home page

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

డీఎస్పీ సూర్యనారాయణ

మల్హర్‌: డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపవద్దని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ గనిలో పనిచేసే డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. డ్రైవర్లు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. గనుల్లో ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని డ్రైవర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై మహేందర్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పీరీల ఊరేగింపు

కాళేశ్వరం: మహదేవపూర్‌, కాళేశ్వరంతో పాటు పలు గ్రామాల్లో మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీరీలను డప్పుచప్పుళ్లతో వీధుల వెంట ఊరేగించారు. కులమత బేధాలు లేకుండా పీరీలకు మొక్కులు చెల్లించారు. కుడుకలు, పూల దండలు వేశారు. అనంతరం పీరీలను గోదావరిలో నిమజ్జనం చేశారు. గోదావరి వద్ద రొట్టెలు భక్తులకు పంపిణీ చేశారు.

జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్‌హోల్స్‌ పూర్తి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బరాజ్‌లో ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సైంటిస్టుల బృందం చేపట్టిన జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ బోర్‌హోల్స్‌ శుక్రవారం పూర్తయ్యింది. మొత్తం 37 బోల్‌హోల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు బరాజ్‌ ఇన్‌చార్జ్‌ ఈఈ సురేష్‌ తెలిపారు. బరాజ్‌ పునరుద్ధరణ కోసం త్వరలో నివేదికలు అందజేస్తారని తెలిసింది.

బైక్‌ అదుపు తప్పి

యువకుడి మృతి

కాళేశ్వరం: బైక్‌ అదుపు తప్పి ఓ యువకుడి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం సబ్‌స్టేషన్‌ మలుపు చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాళేశ్వరం గ్రామానికి చెందిన చకినారపు విష్ణు(22), చెన్నూరు మండలం నాగారం గ్రామానికి చెందిన రామిల్ల వినయ్‌ బైక్‌పై కాళేశ్వరం వస్తున్నారు. ఈక్రమంలో సబ్‌స్టేషన్‌ మలుపు వద్ద బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్క పొదల్లో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అపస్మారక స్థితిలోకి పోయారు. దీనిపై పోలీసులకు సమాచారం అందగా వారు 108 వాహనానికి తెలిపి క్షతగాత్రులను భూపాలపల్లికి ఆస్పత్రికి తరలించగా విష్ణు మృతి చెందాడు. వినయ్‌ వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా, వినయ్‌ స్వగ్రామం చెన్నూరు మండలం నాగారం గ్రామం కాగా, మండలంలోని అన్నారంలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తమాషారెడ్డి తెలిపారు.

అవయవదానం

గొప్ప నిర్ణయం

ములుగు రూరల్‌: అవయవ దానం గొప్ప నిర్ణయమని సదాశయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవన్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు గురువారం ప్రపంచ అవయమ మార్పిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవయవ దాతలను ఆయన అభినందించారు. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన గుండా కుమారస్వామి–శైలజ దంపతులు అవయవ, శరీరదానం చేయడానికి ముందుకొచ్చి సదాశయ ఫౌండేషన్‌కు సంబంధించిన పత్రాలను అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement