హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్‌

Jun 27 2026 12:37 AM | Updated on Jun 27 2026 12:37 AM

మల్హర్‌(కాటారం) : కూతురి మృతికి అల్లుడే కారణమని భావించి అతడిని వదిలించుకోవాలనే కక్షతో సుపారీ ఇచ్చి హత్యాయత్నానికి పాల్పడిన అత్తతో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు శుక్రవారం కాటారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు వివరాలు వెల్లడించారు. కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామానికి చెందిన బాధితుడు చిగురు గణేశ్‌ భార్య చనిపోవడంతో అతని అత్త చింత రాజేశ్వరి కూతురి మరణానికి అల్లుడే కారణమని కక్ష పెంచుకుంది. ఇద్దరు మనువళ్ల పెంపకం భారం తనపై పడడం, అల్లుడు బాధ్యత తీసుకోకపోవడంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తనకు పరిచయమున్న ధరావత్‌ రవీందర్‌నాయక్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్‌గా రూ.లక్షతో పాటు గణేశ్‌ ఫొటో అందించింది. దీంతో రవీందర్‌.. తాడగొండ దామోదర్‌, కొలపాక నాగరాజు, తోలు ప్రశాంత్‌ను ఈ సుపారీలో చేర్చుకున్నాడు. ఈ క్రమంలో నిందితులు ఈనెల జూన్‌ 22న గణేశ్‌ గ్రామానికి వెళ్లి రెక్కీ నిర్వహించారు. ఈనెల 23న కారు మరమ్మతుకు గురైనట్లు నటించి గణేశ్‌ సాయం కోరారు. గణేశ్‌ సాయం చేయడానికి రాగానే నాగరాజు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు వస్తారనే భయంతో అతడిని పొలాల్లోకి తోసేసి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో శుక్రవారం మిగతా డబ్బు కోసం నిందితులంతా కాటారంలోని రాజేశ్వరి ఇంటి వద్ద చర్చిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాటారానికి చెందిన రాజేశ్వరి, కరీంనగర్‌కు చెందిన రవీందర్‌నాయక్‌, దామోదర్‌, నాగరాజు, ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement