ఏడు రకాల తిప్పలు! | - | Sakshi
Sakshi News home page

ఏడు రకాల తిప్పలు!

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

జిల్లాలో సాగు పనులు షురూ

ఈ రకాలకే ప్రభుత్వ బోనస్‌..

1.10 లక్షల ఎకరాల సాగు అంచనా

గతేడాది జిల్లాలో 1.05లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ వానాకాలం సీజన్‌లో 1.10లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గతేడాది ప్రభుత్వం 33 రకాల సన్నాలకు బోనస్‌ అందించింది. ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్‌ చెల్లించింది. దీంతో రైతులు అత్యధికంగా సన్నాలు సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం సన్నాల సాగు రకాల సంఖ్య కుదించడం సరైంది కాదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడు రకాల సన్నాలలో అత్యధిక దిగుబడి, చీడపీడలను తట్టుకొనే, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకునేందుకు రైతులు ఆలోచనలు చేస్తున్నారు. గతేడాది రైతులకు ఎక్కువ సంఖ్యలో విత్తనాలు అందుబాటులో ఉంటుండడంతో వారికి నచ్చిన సీడ్‌ ఎంచుకున్నారు. ఈ ఏడాది అన్నదాతలకు ఆ అవకాశం లేదు.

ఆ ఏడు రకాలకు డిమాండ్‌..

మార్కెట్లో ప్రభుత్వం బోనస్‌ ఇస్తామని చెప్పిన ఏడు రకాల విత్తనానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్‌కు సుమారు 2.75 మెట్రిక్‌ టన్నుల విత్తనాల అంచనా. జిల్లాలో అన్ని మండలాల్లోని డీలర్ల వద్ద విత్తనాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. కొందరు వ్యాపారులు డిమాండ్‌ ఉన్న విత్తనాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ.. ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నట్లు సమాచారం. సాంబా మసూరి ఇప్పటికే దేశీయ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందుతున్న సన్న బియ్యం, వరిసాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నా... ఎక్కువ డిమాండ్‌ ఉన్న సన్న రకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు.

జిల్లాలో వానాకాలం వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ తరుణంలో సన్న వడ్ల బోనస్‌ను కేవలం ఏడు రకాలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిల్లా రైతాంగాన్ని కలవరపెడుతోంది. మార్కెట్‌లో దొరికే విత్తనాల్లో ప్రభుత్వం చెప్పిన ఏడు రకాలు ఏవి? తమ నేలలకు అవి సెట్‌ అవుతాయా? లేదా? అనే సమాచారం లేక సాగు ఆరంభంలోనే అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో లాగా 33 రకాల సన్నాలకూ బోనస్‌ ఇస్తే బాగుండేదని, సాగు పనులు ప్రారంభమైన ఈ సమయంలో ఏ రకం విత్తనాలు వేయాలో తెలియక వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఎలాంటి పంటలు వేయాలనేది ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

– కాళేశ్వరం

సన్న వడ్ల బోనస్‌ను పరిమితం చేస్తూ నిర్ణయం

వరి వంగడాల రకాలు ప్రకటించిన అధికారులు

ఆందోళనలో అన్నదాతలు

ప్రభుత్వం సూచించిన పంట కాలం

వరి రకాలు (రోజులు)

బీపీటీ 52004 140 నుంచి 150

(సోనామసూరి)

ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 120 నుంచి 125

(తెలంగాణ సోన)

కేఎస్‌ఎం 1638 120 నుంచి 125

జైశ్రీరాం 130 నుంచి 135

హెచ్‌ఎంటీ (సోన) 135 నుంచి 145

డబ్ల్యూజీఎల్‌ 44 (సిద్ధి) 140 నుంచి 145

కేఎన్‌ఎం 7715 125 నుంచి 130

(కొత్తతరం సన్నరకం)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement