● నడిచేదారి లేక రోడ్లపైకి వస్తున్న జనం
● పట్టించుకోని అధికారులు
● హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
ఇరువైపులా ఆక్రమణలే..
భూపాలపల్లి పట్టణంతో పాటు మంజూర్‌నగర్‌లో సుమారు మూడు కిలోమీటర్ల పొడవుతో రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాలువలపైన ఫుట్‌పాత్‌లు నిర్మించారు. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రెయినేజీ స్థానంలో పెద్దకాలువ నిర్మించి దానిపై పైకప్పు వేసి ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా వేసిన స్లాబ్‌లపై పాదచారులు నడవడానికి వీలుగా టైల్స్ వేశారు. నిర్మించిన పుట్‌పాత్‌లను రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల యాజమానులు ఆక్రమమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. పట్టణం మొత్తంగా ఇదే పరిస్థితి ఉంది. సర్వీసింగ్ కేంద్రాలు, ఫర్నిచర్ దుకాణాలు, పండ్లు, పాన్‌షాపులు, బట్టల దుకాణాలు, తోపుడు బండ్లు తదితర దుకాణాల యాజమానులు వ్యాపారాలను స్లాబుపై వరకు విస్తరించారు. కేటీకే 5వ గని ప్రధాన ద్వారం నుంచి సంతోషిమాత ఆలయం వరకు ప్రధాన రహదారి వెంట ఫుట్‌పాత్‌లు కబ్జాకు గురైనా ఈ విషయంలో అధికారులు స్పందించడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు.
ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారుల కోసమే.. వాటిని ఆక్రమించడం చట్టవిరుద్ధమని హైకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసినా భూపాలపల్లి పట్టణంలో మాత్రం పరిస్థితి ఏ మాత్రమూ మారలేదు. పట్టణంలో ఫుట్‌పాత్‌లు దాదాపు అన్నిచోట్లా అక్రమ నిర్మాణాలకు, వ్యాపార స్టాళ్లకూ నెలవుగా మారాయి. దుకాణాల ముందరి భాగాలు, వాహనాల పార్కింగ్, కూరగాయల, పండ్ల బండ్లు, చివరకు శాశ్వత కట్టడాలు కూడా ఫుట్‌పాత్‌లను మింగేస్తున్నాయి. దీంతో పాదాచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డుపై నడవాల్సి వస్తోంది. అధికారుల కళ్లముందే ఈ ఆక్రమణలు జరుగుతున్నా వారు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హైకోర్టు వ్యాఖ్యలను అధికారులు ఏ మాత్రమూ సీరియస్‌గా తీసుకోలేదని పట్టణంలోని పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. భూపాలపల్లి పట్టణంలో పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.
– భూపాలపల్లి అర్బన్


