భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పదవ తరగతి పూర్తిచేసిన బాలికల ఉన్నత విద్యా ప్రవేశాలను ప్రోత్సహించేందుకు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గురువారం ప్రత్యేక ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాలు, విద్యా అవకాశాలను వివరించి బాలికలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి, భోజనం, ఇతర సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా చిట్యాల మండలానికి చెందిన గీతాంజలి అనే విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడిన అడిషనల్ కలెక్టర్ ఆమె ఆసక్తిని తెలుసుకుని మహదేవపూర్ కేజీబీవీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్‌టీ) కోర్సులో ప్రవేశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచి మహదేవ్‌పూర్ కేజీబీవీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్‌టీ) కోర్సును నూతనంగా ప్రారంభించినట్లు తెలిపారు. టేకుమట్ల, కాటారం, గణపురం కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు అందుబాటులో ఉండగా, చిట్యాల, భూపాలపల్లి, రేగొండ, మొగుళ్లపల్లి, మల్హర్, మహాముత్తారం, పలిమెల కేజీబీవీల్లో సీఈసీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి కోర్సుకు ఒక్కో తరగతిలో 40 సీట్లు ఉన్నాయన్నారు. విద్యార్థినులు తమ ఆసక్తులు, అభిరుచులు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకుని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం


