భూపాలపల్లి: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే అందరి బాధ్యత అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై బుధవారం జిల్లా కేంద్రంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు 2కే రన్ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. ‘డ్రగ్స్‌కు నో చెప్పండి–ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం’ అనే సందేశాన్ని యువతకు అందించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజలు మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి దుష్పభ్రావాలు, కుటుంబాలు, సమాజంపై పడే ప్రభావంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నిర్మూలనలో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. యువత తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


