– భూపాలపల్లి | - | Sakshi
Sakshi News home page

– భూపాలపల్లి

Jun 25 2026 1:12 AM | Updated on Jun 25 2026 1:12 AM

అల్పాహారం లేదు.. భోజనమే.. నాడు 300 మంది.. నేడు 8 మంది విద్యార్థులే..

సంక్షేమ హాస్టళ్లలో పేద విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పే పాలకుల, అధికారుల మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతనలేదు. గీజర్లు, వాటర్‌ ప్యూరిఫయర్లు పనిచేయడం లేదు. టాయిలెట్లు, మరుగుదొడ్లకు కనీసం డోర్లు కూడా లేవు. హాస్టల్‌లోనే ఉండి విద్యార్థులను చూసుకోవాల్సిన వార్డెన్లు స్థానికంగా ఉండడం లేదు. మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంతో పాటు భోజనంలో నాణ్యత కూడా లేని పరిస్థితి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లను సాక్షి బృందం బుధవారం విజిట్‌ చేసింది.

చిట్యాల: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో గతేడాది 50 మంది విద్యార్థులు ఉండగా ఈ విద్యా సంవత్సరం నిన్నటి(బుధవారం) వరకు కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే వచ్చారు. కాగా వీరికి సైతం మెనూ ప్రకారం అల్పాహారం అందడం లేదు. బుధవారం కిచిడీ అందించాల్సి ఉండగా అన్నం, పచ్చిపులుసు చేశారు. దీంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఈ హాస్టల్‌ విద్యార్థులు పడుకునే గదులకు తలుపులు పూర్తిగా విరిగిపోయి ఉన్నాయి. దీంతో ఈ వర్షాకాలంలో వర్షపు నీరు గదుల్లోకి వచ్చి విద్యార్థులు ఇబ్బంది ఎదుర్కోనున్నారు.

గణపురం: మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్‌ను సుమారు 30 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రస్తుత భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట తదితర ప్రాంతాల నుంచి సుమారు 300 మంది ఈ హాస్టల్‌లో ఉండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే వారు. ఇప్పుడు ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందా అన్నట్లుగా ఉంది. గోడలు, స్లాబ్‌ పగుళ్లు తేలాయి. ఈ హాస్టల్‌లో ప్రస్తుతం 8మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వాటర్‌ ప్యూరిఫయర్‌, గీజర్‌లు పని చేయడం లేదు. టాయిలెట్స్‌, మరుగుదొడ్లకు డోర్లు లేవు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గీజర్‌ పని చేయకపోవడంతో విద్యార్థులు బోరు నీటితోనే ఆరుబయట స్నానాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement