మహాముత్తారం: సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అధికారులను ఆదేశించారు. బుధవారం మహాముత్తారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని పలు సూచనలు చేశారు. ఎలక్షన్ వర్క్ పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దండు శ్రీనివాస్, ఆర్‌ఐ భాస్కర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గొత్తికోయగూడేల్లో బడిబాట
మహాముత్తారం: మండలంలోని పెగడపల్లి ఆశ్రమపాఠశాల ఉపాధ్యాయులు సింగారం, దండేపల్లి, మద్దిమడుగు, మోదేడు గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థుల ను ఆశ్రమ పాఠశాలలో చేర్పించాలని గిరిజన తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజ్మీరా శ్రీని వాస్, కత్తెర్ల మల్లయ్య, లాకవత్ శంకర్, వెంకట్‌రాం,కిషన్, చందు తదితరులు ఉన్నారు.
దేవస్థానం టెండర్ ప్రక్రియ వాయిదా?
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం జీర్ణోద్ధరణ, తొలగింపునకు ప్రభుత్వం రూ.198కోట్లు కేటాయించగా ఏప్రిల్ 20న సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈనెల 23న టెండర్ జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడ్డట్లు సమాచారం. ఇప్పటికే ప్రకారాలు, మూలవిరాట్‌లను తొలగిస్తున్నారు. మరో వారం పాటు టెండర్ ప్రక్రియ కోసం వేచిచూడాల్సిందేనని తెలిసింది.
సమస్యలు
పరిష్కరించకుంటే సమ్మె
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు. ఏరియాలోని కేటీకే 5వ గనిలో బుధవారం ఫిట్ కార్యదర్శి రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి రక్షణకోసం కార్మికులంతా ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో నిర్వహించే చర్చల్లో 31 డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సమస్యలు యాజమాన్యం పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, నాయకులు మాతంగి రాంచందర్, ఆసిఫ్ పాషా, చంద్రమౌళి, రవికుమార్, తిరుపతి, మల్లికార్జున్, సత్తి, కుమార్ పాల్గొన్నారు.
సంపులో పడి
వృద్ధురాలి మృతి
గణపురం: సంపులో పడి వృద్ధురాలి మృతిచెందిన ఘటన గణపురం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన గొడిశాల సరోజన(70) తెల్లవారుజామున కాలకృత్యాల కోసం ఇంటి బయటకు వచ్చింది. ఇంటి బయటకు వచ్చిన ఆమె ఇంట్లోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూశారు. సంపులో పడి ఉండడం గమనించి బయటకు తీశారు. అప్పటికే సరోజన మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు సరోజన కుమారుడు గొడిశాల రాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


