భూపాలపల్లి అర్బన్: ఓటరు జాబితా రూపకల్పనలో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బుధవారం ఇల్లందు క్లబ్‌హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధమని తెలిపారు. స్వేచ్చాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహణకు ఓటరు జాబితా సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్–2026)లో అర్హులైన ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా ఖచ్చితత్వంపై ఎన్నికలు నిర్వహణ ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అర్హులైన ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును నమోదుచేసుకోవాలని సూచించారు. ఇప్పటికే నమోదు చేసుకున్న ప్రజలు తమ పేర్లును తనిఖీ చేసుకోవాలని, అవసరమైతే సవరణలు, మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరణించిన వ్యక్తుల వివరాలు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేందుకు (సర్) కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా.. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఏఎస్పీ నరేష్‌కుమార్, డీఆర్వో వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్రా రఘు, ఎన్నికల విభాగం డీటీ అబ్బాస్, కౌన్సిలర్ అప్పం కిషన్, అన్ని శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


