భూపాలపల్లి అర్బన్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యం ఆధారంగా పరిష్కరించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మార్చి 6నుంచి జూన్ 12వరకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ వివిధ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రామసభల్లో మొత్తం 6,391 దరఖాస్తులు అందగా, వాటిలో 716 పరిష్కరించబడ్డాయని, మిగిలిన 5,674 దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పింఛన్లు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సౌకర్యాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించామన్నారు. సమస్యల పరిష్కారానికి టైమ్‌బౌండ్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. రహదారి భద్రత, సీపీఆర్, గుడ్ సమారిటన్, గోల్డెన్ అవర్, మహిళలు, చిన్నారుల రక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. వాహనాల వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్స్ ఏర్పాటు అవసరమని పేర్కొనగా, సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రత్యేక అధికారి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్


