సర్టిఫికెట్‌కో లెక్క! | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్‌కో లెక్క!

Jun 24 2026 12:41 AM | Updated on Jun 24 2026 12:41 AM

నిబంధనలు ఇలా.. పుస్తకానికి ఓ లెక్క

భూపాలపల్లి అర్బన్‌: పదో తరగతి ఉత్తీర్ణులై పై చదువుల కోసం కాలేజీలో చేరాలనుకుంటున్న విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు నిలువునా దోపిడీ చేస్తున్నాయి. విద్యాశాఖ నిబంధనలు తుంగలో తొక్కుతూ సర్టిఫికెట్ల జారీకి అడ్డగోలు వసూళ్లకు తెరతీశాయి. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం టీసీ ఉచితంగా లేదా నామమాత్రపు రుసుంతో ఇవ్వాల్సి ఉండగా.. వేల రూపాయలు వసూలు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో క్లియరెన్స్‌ పేరిట టీసీలు ఇవ్వకుండా ఇక్కట్లకు గురి చేస్తున్నారు. టీసీ, బోనఫైడ్‌కు వచ్చే విద్యార్థులను బకాయిలు చెల్లించాలని మెలిక పెట్టడం, రూ. వేల వసూలు చేయడం పరిపాటిగా మారింది.

టీసీ జారీ చేయడంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా వారంలోపు టీసీ ఇవ్వాలి. విద్యార్థి, తల్లిదండ్రులు ఇచ్చిన దరఖాస్తును స్కూల్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, జన్మదినం, చదివిన తరగతి, స్కూల్‌ పేరు, వెళ్లే తే దీ, కారణం మొదలైనవి స్పష్టంగా పేర్కొనాలి. టీసీ పోయినట్లయితే డూప్లికేట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు నామమాత్రంగా ఫీజు వసూలు చేసే వెసులుబాటు ఉంది. ఏదో కారణం చూపి టీసీ జారీలో జాప్యం చేయొద్దు. టీసీతోపాటు స్టడీ సర్టిఫికెట్‌, మెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజు వసూలు చేస్తే రశీదు ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగానే ఇవ్వాల్సి ఉండగా.. కొన్నిచోట్ల నామమాత్రంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. చాలాచోట్ల ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి.

జిల్లా విద్యాశాఖ 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన నిర్వహణ ఫీజుల వివరాలను ప్రకటించింది. డిస్ట్రిక్‌ కో–ఆర్డినేటర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (డీసీఈబీ) ఆధ్వర్యంలో పాఠశాలల్లో అమలు చేసే మార్గదర్శకాలను వెల్లడించింది. రికార్డు షీట్‌ బుక్స్‌, టీసీ బుక్స్‌ నిర్వహణ ఖర్చులకు పాఠశాలలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు రూ.400, ప్రైవేట్‌స్కూళ్లు రూ.1000 చెల్లిస్తే టీసీ బుక్స్‌ డీసీఈబీ పంపిణీ చేస్తోంది. ఒక్కో పుస్తకంలో 100 పేజీలుంటాయి. ఈ లెక్కన ఒక్కో పేజీకి రూ.10 మాత్రమే టీసీకి చెల్లిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా, ప్రైవేట్‌ పాఠశాలలు నామమాత్రపు ప్రాసిసెంగ్‌ ఫీజు రూ.10నుంచి రూ.50 వసూలు చేస్తే అభ్యంతరాలు ఉండవు. కానీ వందల రూపాయలు వసూలు చేయడంపై తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.

ఇటీవల ప్రేమ్‌కుమార్‌ పదో తరగతి పూర్తి చేశాడు. పై చదువుల నిమిత్తం ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ) కోసం తన తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్లాడు. యాజమాన్యం టీసీ ఇవ్వడానికి రూ.2000, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌కు రూ.1100 డిమాండ్‌ చేసింది. ఉచితంగా ఇవ్వాల్సిన పత్రాలకు రుసుం వసూలు చేస్తుండడంతో విద్యార్థి తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి.

విద్యాశాఖ నిబంధనలు బేఖాతరు

టీసీకి రూ.2000, బోనఫైడ్‌ రూ.1000 వసూలు

ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు

పాఠశాలలు సంఖ్య విద్యార్థులు

ప్రభుత్వ 412 23వేలు

ప్రైవేట్‌ 75 21వేలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement