కాశిబుగ్గ: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి మహర్దశ రానుందా? ఎంతోకాలం నుంచి వైద్యులు ఎదురు చూస్తున్న ‘అడిషనల్ డీఎంఈ’ హోదా లభించే అవకాశం ఉందా అంటే.. ఆస్పత్రి వర్గాల నుంచి అవుననే సమధానాలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్లతో నడుస్తున్న ఎంజీఎం ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 20 రోజుల నుంచి సూపరింటెండెంట్ లేకుండా ఖాళీగా ఉంటున్న ఈ పోస్టును రెగ్యులర్‌గా ఉండేలా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మూడు, నాలుగు నెలల్లో వరంగల్‌లో 24 అంతస్తుల సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ సూపరింటెండెంట్‌ను నియమిస్తేనే అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి నుంచి ఇన్‌చార్జ్‌ల పాలనే..
వరంగల్‌లో ఎంజీఎం ఆస్పత్రి ప్రారంభం నుంచి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ల పాలన కొనసాగుతోంది. ఇక్కడ అడిషనల్ డీఎంఈ పోస్టు లేకపోవడంతో ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్లను ప్రభుత్వం నియమిస్తుంది. ఈ పోస్టు ఇన్‌చార్జ్ కావడంతో దూర ప్రాంతాల నుంచి సీనియర్ వైద్యులు రావడానికి సానుకూలత వ్యక్తం చేయట్లేదు. ఎంజీఎంలో పనిచేస్తున్న సీనియర్ వైద్యులచే ఇన్‌చార్జ్‌ల పాలన చేయిస్తున్నారు. సదరు వైద్యులు ఉద్యోగ విరమణ పొందేవరకు కూడా ఇక్కడే విధులు నిర్వహించారు. వీరిలో డాక్టర్ అశోక్ ఎగ్బోటే, డాక్టర్ రఘురాం, డాక్టర్ సత్యదేవ్, డాక్టర్ ఏఎన్‌ఆర్ లక్ష్మి, డాక్టర్ సురేందర్, డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ దొడ్డా రమేశ్ ఉన్నారు.
ఇన్‌చార్జ్‌ల పాలనకు తెరపడేనా?
ఇన్నాళ్లు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్లతో నడుస్తున్న ఎంజీఎం సర్కారు దవాఖానకు మోక్షం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రెగ్యులర్ సూపరింటెండెంట్ ఎంతైనా అవసరం అనే కోణంలో ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ నియామకంలో జాప్యం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నూతనంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, నర్సంపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ప్రభుత్వ ఆస్పత్రులకు రెగ్యులర్ సూపరింటెండెంట్లను నియమించిన ప్రభుత్వం ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దాస్పత్రి అయిన ఎంజీఎంకు లేకపోవడమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎంజీఎంపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఇటీవల వరంగల్‌లో జరిగిన దిశ సమావేశంలో మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రి అధ్వానంగా మారుతోందని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులను ప్రశ్నించారు.
అడిషనల్ డీఎంఈ పోస్టు వస్తే..
వరంగల్ ఎంజీఎంకు అడిషనల్ డీఎంతో పోస్టు వస్తే రెగ్యులర్ సూపరింటెండెంట్ వస్తారు. ఇన్‌చార్జ్‌ల పాలనకు తెరపడుతుంది. ఈపోస్టులో జాయిన్ కావడానికి సీనియర్ వైద్యులు ఆసక్తి చూపుతారు. పదోన్నతుల అవకాశం ఉంటుంది. ఆస్పత్రికి పవర్‌తో పాటు ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. ఆస్పత్రి కూడా అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుంది. రోగులకు మెరుగైన సేవలు అందుతాయి. కాగా, ఉస్మానియాలో రెండు సూపరింటెండెంట్ పోస్టులు, ఒక ప్రిన్సిపాల్ పోస్టు, వరంగల్‌లో ఎంజీఎంలో సూపరింటెండెంట్ పోస్టుకు అడిషనల్ డీఎంఈ క్యాడర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఎంజీఎంకు ‘అడిషనల్ డీఎంఈ’ హోదా కోసం ఎదురుచూపులు రెగ్యులర్ సూపరింటెండెంట్ పోస్టుతో తీరనున్న వెతలు


