పదిలమైన ప్రణాళిక! | - | Sakshi
Sakshi News home page

పదిలమైన ప్రణాళిక!

Mar 5 2026 7:39 AM | Updated on Mar 5 2026 7:39 AM

పదిలమైన ప్రణాళిక! ఉత్తీర్ణత శాతం పెరగడానికే..

పాఠశాలకు రావాల్సిందే..

మహదేవపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు

కాళేశ్వరం: పదోతరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం మార్పులు చేసింది. మారిన విధానం ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది వార్షిక పరీక్షలు ఆదివారాలు, సెలవు రోజులను మినహాయించి వరుసగా నిర్వహించే వారు. ఒక్కో పరీక్షకు మధ్యలో గడువు ఉండేది కాదు. ప్రస్తుతం మారిన విధానం ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 14 వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది. ఒక్కో పరీక్షకు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్‌లో విద్యార్థులు చదివి పరీక్షలకు సిద్ధమై మంచి ఉత్తీర్ణత మార్కులు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. 12 మండలాల్లో 122 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 1,701 మంది, బాలికలు 1,843 మంది కాగా మొత్తం 3,544 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.

ప్రీఫైనల్‌ పరీక్షల ఆధారంగా..

ఇప్పటికే ప్రీఫైనల్‌ పరీక్షలు ముగియడంతో ప్రత్యేక కార్యాచరణ ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రీఫైనల్‌ పరీక్షల సమాధాన పత్రాలను దిద్ది వాటిని తల్లిదండ్రులకు పంపించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎక్కడ వెనుకబడి ఉన్నారు.. ఎక్కడ తప్పులు రాస్తున్నారు.. ఉపాధ్యాయులు గుర్తించి సరైన సమాధానాలు రాసేలా చూడాలి. ఈ పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ మూడు గ్రేడ్లుగా విభజించి వారిలో సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి.

మారిన పరీక్షల విధానంతో ఉత్తీర్ణత శాతం పెరగడానికి అవకాశం ఉంది. పరీక్షల మధ్యన గ్యాప్‌ సమయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి. ఉపాధ్యాయులు నిర్వహించే ప్రత్యేక తరగతులకు తప్పక హాజరుకావాలి. పట్టుదలతో చదవి మంచి మార్కులు సాధించాలి. విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రత్యేక తరగతులకు పంపించాలి.

– రాజేందర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

మొదటి తెలుగు పరీక్ష తర్వాత హిందీ పరీక్షకు మధ్యలో మూడు రోజుల సమయం ఉంది. ఈ మూడు రోజులు విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. సబ్జెక్టు టీచర్‌ వారికి రోజుకు మూడు పీరియడ్లు నిర్వహించి సబ్జెక్టులో మెరుగైన మార్కులు సాధించేలా శిక్షణ ఇస్తారు. మొదటి పీరియడ్‌లో రివిజన్‌, రెండో పీరియడ్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌, మూడో పీరియడ్‌లో సమాధాన పత్రాలు దిద్ది తప్పులు సరిచేస్తారు. గంట సమయంలో 20 నిమిషాలు పాఠ్యాంశ బోధన, 40 నిమిషాలు సమాధానాలు రాసేందుకు కేటాయిస్తారు. ఇలా ప్రతీరోజు సబ్జెక్టు సాధన చేయిస్తారు. ప్రతీ పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల సమయం ఉంటుంది. మధ్యలో పండుగలు, ఆదివారాలు మినహాయిస్తే మూడు నుంచి నాలుగు రోజుల సమయం విద్యార్థుఽలకు లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement