● జనసంద్రంగా మారిన ఆలయ ప్రాంగణం
రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతర వైభవంగా సాగింది. బుధవారం ఉదయం హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం స్వామి వారికి బోనాలు సమర్పించినట్లు ఆలయ అర్చకులు బుచ్చమచార్యులు తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ ముఖ్యఅతిథిగా హాజరై పెద్ద రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
నారసింహుడి నామస్మరణతో..
కోటంచ ఆలయ పరిసర ప్రాంగణం భక్తుల నారసింహుడి నామస్మరణతో మార్మోగింది. భక్తులు ఎడ్లబండ్లతో పాటు ప్రభ బండ్లు, ఇతర వాహనాలతో జాతర ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. జాతరకు జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, ములుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. డీఏస్పీ సంపత్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఆల య ఈఓ మహేష్, కమిటీ చైర్మన్ నాయినేని సంపత్ రావు, ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


