
యూరియా కొరత సృష్టించొద్దు
● కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి అర్బన్: ఫర్టిలైజర్ షాపు యజమానులు యూరియా కొరత సృష్టించొద్దని, ఎరువుల సరఫరాపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం యూరియా సరఫరాపై కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ, సహకార, సహకార సంఘాల సీఈఓలు, మార్క్‌ఫెడ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటలకు అవసరమైన యూరియా రైతులకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు వరి, పత్తి, మిర్చి, పప్పు దినుసుల పంటలు ఒకేసారి సాగు చేయడంతో యూరియా వినియోగం పెరిగిందన్నారు. మండల స్థాయిలో స్టాక్ వివరాలు మానిటరింగ్ చేయాలని, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి యూరియా తరలించి రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రైవేట్ డీలర్లు యూరియా కొనుగోలుకు ఇతర మందులు తీసుకోవాలని లింకు పెట్టొద్దన్నారు. అధికారులు, టాస్క్ టీములు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్, ప్రైవేట్ కంపెనీల వద్ద మండల స్థాయిలో స్టాక్ ఎంత ఉందో క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సహకార అధికారి వాలియానాయక్, మార్క్‌ఫెడ్ డీఎం, సహకార సంఘాల సీఈఓలు, ఏఓలు పాల్గొన్నారు.