
పేరూరు వద్ద క్రమేపీ పెరుగుతూ..
వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 13.940 మీటర్లు ఉండగా మంగళవారం సాయంత్రానికి 15.900 మీటర్లకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో గోదావరి వరద తీవ్రత భారీగా పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ సిబ్బంది తెలిపారు. పూసూరు హైలెవల్ బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.
ఇన్‌టేక్‌వెల్ వద్ద వరద ఉధృతి పరిశీలన
మంగపేట: మండలంలో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో మండల కేంద్రంలోని పొదుమూరు, కమలాపురం ఇన్‌టేక్ వెల్ వద్ద గోదావరి వరద ఉధృతిని మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థరెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాలైన పొదుమూరు, దేవనగరం, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా పంచాయతీల కార్యదర్శులను ఆదేశించారు.