
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
కాటారం: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. మహాముత్తారం మండలం యామన్‌పల్లి వద్ద గల వాగు, కేశవపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న పెద్దవాగును మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వరద నీటి ప్రవాహం, రాకపోకల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ ఆరాతీశారు. రహదారిపై నుంచి వరదనీటి ప్రవాహం కారణంగా వాహనదారులు ఆజంనగర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేయాలని కలెక్టర్ తెలిపారు. వాగుల వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రాకపోకలను నిలిపివేయాలని ట్రాక్టర్లు, భారీకేడ్లు అడ్డుగా పెట్టాలని పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాగుల్లో చేపలు పట్టేందుకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం మండలంలో యూరియా, ఎరువుల లభ్యత, స్టాక్ వివరాలను ఏఓ అనూషను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సమయానికి ఎరువులు అందేలా చూడాలని, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని సూచించారు. వ్యవసాయేతర అవసరాల కోసం యూరియా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు, రైతులకు ఇబ్బందులు కలిగేలా ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయించకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు. మండలంలోని ఎరువుల దుకాణాలు, ఎరువుల విక్రయ కేంద్రాల్లో నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేశ్, పీఆర్ డీఈఈ రవీందర్, ఏఓ అనూష, ఎంఈఓ రవీందర్‌రెడ్డి ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
మహాముత్తారం మండలంలో వాగుల పరిశీలన