
ఇంకా ఇన్‌స్పైర్ కాలేదు!
నామినేషన్ల ప్రక్రియ ఇలా..
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇన్‌స్పైర్ అవార్డు మనక్ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో.. భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ (డీఎస్‌టీ), నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) ద్వారా ప్రతి సంవత్సరం ఇన్‌స్పైర్ అవార్డుల మనక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, వివిధ గురుకులాల్లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో ఒక్కో పాఠశాలల నుంచి ప్రాజెక్టుల రూపకల్పనకు ఐదు చొప్పున నామినేషన్లు స్వీకరిస్తున్నారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు మహబూబాబాద్ జిల్లా మినహా మిగిలిన ఐదు జిల్లాల్లో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మహబూబాబాద్ జిల్లా 789 నామినేషన్లతో రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. సెప్టెంబర్ 15 వరకు గడువు ఉండడంతో ఇంకా నామినేషన్లు పెరిగే అవకాశం ఉంది.
సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తేనే..
ఉమ్మడి జిల్లాలోని డీఈఓలు, జిల్లా సైన్స్ అధికారులు ఇప్పటికే అన్ని యాజమాన్యాల పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశాలు నిర్వహించారు. ఇన్‌స్పైర్ అవార్డులకు నూతన ఆవిష్కరణల ప్రాజెక్టులతో విద్యార్థులతో నామినేషన్లు చేయించాలని ఆదేశించారు. నామినేషన్లు చేయించేందుకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో టెక్నికల్ టీంలు కూడా ఏర్పాటుచేశారు. పాఠశాలల్లో ఐడియా బాక్స్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా సైన్స్ టీచర్లు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే నామినేషన్లు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్‌ఎంలు, టీచర్లలో కొంత నిర్లిప్తత కూడా కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం డీఈఓ, సైన్స్ అధికారి ప్రత్యేక దృష్టిసారించడంతో నామినేషన్లు బాగా అయ్యాయని తెలుస్తోంది.
ఇన్‌స్పైర్ అవార్డులకు నామమాత్రంగానే నామినేషన్లు పంపారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీసేందుకు ఒక చక్కటి వేదిక ఇన్‌స్పైర్ అవార్డు మనక్. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తమ విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంటుంది. అందుకు ఒక ఐడియాతో ప్రాజెక్టుకు సంబంధించి సంక్షిప్తంగా వివరాలు పంపించాలి. హెచ్‌ఎంలు, టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి సెప్టెంబర్ 15లోగా విద్యార్థులతో నామినేషన్లు పంపాలి.
– ఎస్.శ్రీనివాసస్వామి,
హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి
హెచ్‌టీటీపీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌స్పైర్‌అవార్డ్స్–డీఎస్‌టీ.గౌట్.ఇన్ ద్వారా లేదా గూగుల్ ప్లేస్లోర్‌లో ఇన్‌స్పైర్ మనక్‌యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. స్కూల్ అథారిటీ ద్వారా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి విద్యార్థుల ఆవిష్కరణ వివరాలను నమోదు చేయడంతోపాటు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. పాఠశాలల హెచ్‌ఎంలు, గైడ్ టీచర్ల సహకారంతో విద్యార్థులతో ప్రాజెక్టులకు సంబంధించి ఇన్‌స్పైర్ నామినేషన్‌కు కావాల్సినవి..
విద్యార్థి సృజనాత్మక ఆలోచన లేదా ప్రాజెక్టు సంక్తిప్త నివేదిక రెండువేల పదాలకు మించకూడదు.
విద్యార్థి ఆధార్ కార్డుతో అనుసంధానించిన ఏదైనా జాతీయ బ్యాంకు లేదా పోస్టాఫీస్ ద్వారా జారీచేసిన పొదుపు ఖాతా పాస్‌పుస్తకం, విద్యార్థి పాస్‌ఫొటో, వివరాలు, ఫోన్‌నంబర్, గైడ్ టీచర్ వివరాలు కూడా ఉండాలి.
‘ఇన్‌స్పైర్ మనక్’ అవార్డుల
నామినేషన్లు వేయించేందుకు పెద్దగా ఆసక్తి చూపని హెచ్‌ఎంలు, టీచర్లు
789తో మహబూబాబాద్ రాష్ట్రంలోనే మొదటి స్థానం
మిగిలిన జిల్లాల్లో తక్కువగా వేసిన విద్యార్థులు

ఇంకా ఇన్‌స్పైర్ కాలేదు!