వన మహోత్సవానికి సన్నద్ధం
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వన మహోత్సవం నిర్వహణకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 241 నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రక్రియ గతేడాది అక్టోబర్ నుంచే ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాలు నాటి మొక్కలను సంరక్షిస్తున్నారు. నర్సరీల్లో ఈ ఏడాది పూలమొక్కలు, నీడనిచ్చే తదితర జాతులకు చెందిన 18.82 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా డీఆర్‌డీఏ 17 లక్షలు, ఫారెస్టు శాఖ 51వేలు, సింగరేణి 1.31 లక్షల మొక్కలను కేటాయించారు. ఇందులో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 29,81,400, ఫారెస్టు ఆధ్వర్యంలో 1,51,000, సింగరేణి ఆధ్వర్యంలో 1,67,000 మొత్తం 32,99,400 పెంచిన మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. గత సంవత్సము నాటిన మొక్కలు ఎదగక ముందు చనిపోతే వాటి స్థానంలో మళ్లీ నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బంజరు భూములు, కాల్వలు, చెరువుగట్లు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటుతారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీలు, ఇతర ప్రాంతాల్లోని నర్సరీల్లో మొక్కల సంరక్షణకు వన సేవక్‌లను నియమించారు. మొక్కలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరందిస్తున్నారు. ప్రతీ పదిహేను రోజులకోసారి కలుపు తీసి ఎరువులు వేస్తున్నారు. చనిపోయిన, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా విత్తనాలు, మొక్కలు నాటుతున్నారు. ఎండ వేడికి మొక్కలు చనిపోకుండా ప్రతీ నర్సరీలో గ్రీన్‌షేడ్‌నెట్ (నీడ పరదాలు) ఏర్పాటు చేశారు. జూన్ నెలలో ప్రభుత్వం నిర్వహించే వన మహోత్సవంలో మొక్కలు నాటనున్నారు.
భారీ వృక్షజాతుల
మొక్కలు..
భారీ వృక్ష జాతుల మొక్కల పెంపకం ఈ ఏడాది నుంచి చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. సుమారుగా 7.63 లక్షల మొక్కలను దాదాపు 2.5 మీటర్ల ఎత్తు పెంచడానికి నర్సరీల్లో చర్యలు తీసుకుంటున్నారు. భారీ వృక్షజాతులుగా పిలిచే గల్మోహార్, నిద్రగన్నేరు, కానుగ, సుబాబుల్, చైనా బాదం, తటోబియా, నల్లమద్ది, గీత కార్మికుల కోసం ఈత, తాటి మొక్కలు పెంచుతున్నారు. ఏడాది పాటు నర్సరీల్లో పెరిగితే దాదాపు రెండు మీటర్ల నుంచి 2.5 మీటర్ల ఉంటాయి. ఆ మొక్కలను ప్రభుత్వ స్థలాలు, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటితే నీడతో పాటు, ఆహ్లాదంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. భారీగా మొక్కల ను నాటేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
జిల్లాలో 18.82 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
అందుబాటులో 32.99లక్షల మొక్కలు
ఎండల నుంచి రక్షణకు
గ్రీన్ షేడ్‌నెట్ ఏర్పాటు
ప్రతీ నర్సరీకి వన సేవక్‌ల ఏర్పాటు
మండలాల వారీగా
పెంచిన మొక్కలు (లక్షల్లో)
భూపాలపల్లి 2.98
చిట్యాల 3.09
గణపురం 2.09
కాటారం 2.98
మహదేవ్‌పూర్ 2.23
మహముత్తారం 2.96
మల్హర్ 1.85
మొగుళ్లపల్లి 3.09
పలిమెల 0.98
రేగొండ 4.58
టేకుమట్ల 2.98
ఫారెస్టుశాఖ 0.51
సింగరేణి 1.31
ఇంటి ఆవరణలో మొక్కలు నాటుకోవాలి
వన మహోత్సవంలో భాగంగా పంపిణీ చేసే పండ్ల మొక్కలు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు ప్రతీ ఇంటి ఆవరణలో నాటుకోవాలి. ఈ సంవత్సరం జూన్, జూలై మాసాల్లో వన మహోత్సవం పూర్తి చేయాలనుకుంటున్నాం. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలి. ఎండ నుంచి రక్షణ కోసం గ్రీన్ పరదాలను ఏర్పాటు చేశాం. మొక్కలు చనిపోకుండా ఎరువులు వేసి కాపాడుతున్నారు.
– బాలకృష్ణ, డీఆర్‌డీఓ
వన మహోత్సవానికి సన్నద్ధం
వన మహోత్సవానికి సన్నద్ధం


