భూపాలపల్లి అర్బన్: ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లోని కార్యాలయ సమావేశపు హాల్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 121 పాఠశాలలకు చెందిన 1,725 మంది బాలురు, 1,724 మంది బాలికలు మొత్తం 3,449 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని చెప్పారు. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచిఉండకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను తహసీల్దార్లు పరిశీలించి ధృవీకరణ నివేదికలు అందచేయాలని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. సెంటర్ కస్టోడియన్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఇన్‌చార్జ్ డీఈఓ రాజేందర్, క్రైం డీఎస్పీ నారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కళ్లద్దాల పంపిణీ
విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కంటి పరిరక్షణకు అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గత నెలలో కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కంటిచూపు సమస్యలున్నట్లు గుర్తించిన విద్యార్థులకు తిరిగి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి భూపాలపల్లిలో కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ పరీక్షల ద్వారా దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన 658 మంది విద్యార్థుల్లో 292మందికి మొదటి విడతగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశామని, మిగిలిన విద్యార్థులకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆర్‌బీఎస్‌కే కో–ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్, పీఓ ప్రమోద్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
పకడ్బందీగా టెన్త్ పరీక్షలు