పనుల ప్రారంభమెప్పుడో..?
● పలు మండలాల్లో మినీ జాతరలు
● సౌకర్యాలు కల్పించాలని భక్తుల వేడుకోలు
భూపాలపల్లి అర్బన్/మొగుళ్లపల్లి: జిల్లాలోని మినీ మేడారం జాతరలపై రాష్ట్రం, జిల్లా యంత్రాంగం, ప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రతీ జాతర సమయంలో నిధులు కేటాయించే ప్రభుత్వం ఈ సారి ఇప్పటివరకు కేటాయించలేదు. చాలా సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోని పలు మండలాల్లో సమ్మక్క, సారలమ్మ మినీ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ జాతరలకు వేలాది మంది భక్తులు హాజరవుతున్నారు. వీరికి కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంలో పాలకులు మాత్రం విఫలమవుతున్నారు. ప్రతీ రెండేళ్లకోకసారి ఎంతో వైభవంగా జరిగే సమ్మక్క–సారలమ్మ మినీ జాతర పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జాతరకు ఇంకా 18 రోజుల సమయమే మిగిలి ఉంది. జాతర జరిగే ప్రాంగణం చెత్తాచెదారం, పిచ్చి మొక్కలతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి.
గత జాతరలకు నామమాత్రంగా..
గత నాలుగు జాతరలకు నిధులు అంతంత మాత్రమే కేటాయించారు. జాతరకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించి పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని చిన్న జాతరల అభివృద్ధికి 2016లో అప్పటి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఏడు సంవత్సరాల క్రితం ప్రతీ జాతర వద్ద మౌలిక వసతులకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేయించారు. గతంలో చేసిన పనులకు టెండర్లు దక్కిందుకున్న కాంట్రాక్టర్లు జాతర అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. నమ్మక్క, సారలమ్మ గద్దెలకు చేసిన కాంక్రీటు పనులు, సీసీ రోడ్లు, కల్వర్టులు, కరెంట్ సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలను నామామత్రంగా చేశారు. ప్రస్తుతం జాతర ప్రాంగణాలు పిచ్చి మొక్కలు, వ్యర్థాలతో నిండిపోయాయి. కనీసం పిచ్చి మొక్కలు తొలగించడానికి కూడా నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు కేటాయించాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ స్పందించి ఈ నెల 28వ తేదీ నుంచి జరగనున్న జాతరలో భక్తులకు కావాల్సిన సౌకర్యాలపై ప్రణాళికలు తయారుచేసి నిధులు మంజూరు చేయాలి. మరుగుదొడ్లు, కరంట్, తాగునీరు, స్నానాలు చేసేందుకు బోర్లు, ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
మినీ జాతరలు జరిగేవి ఇక్కడే..
భూపాలపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. భూపాలపల్లి మండలంలోని గుర్ర పేట, కమలాపూర్, చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం–చైన్‌పాక గ్రామాల శివారులోని పూరేడుగుట్ట, మొగుళ్లపల్లి–ముల్కలపల్లి గ్రామాల మధ్య చలివాగు పక్కన, రేగొండ మండలంలోని తిరుమలగిరి–జగ్గయ్యపల్లి గ్రామాల్లో జరుగనుంది.
పనుల ప్రారంభమెప్పుడో..?
పనుల ప్రారంభమెప్పుడో..?


