ఇసుక అక్రమ డంపులు
మల్హర్: మండలంలో తాడిచర్ల (కాపురం రెవెన్యూ) శివారులోని తాడిచర్ల–పెద్దతూండ్లకు వెళ్లే ప్రధాన రహదారి (పెద్దతూండ్ల ఆరెవాగు) సమీపంలో అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేశారు. పెద్దతూండ్ల ఆరెవాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి డంపు చేశారు. సుమారు 35 నుంచి 40 ట్రాక్టర్ల మేర ఇసుక డంపులు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. తహసీల్దార్ రవికుమార్‌ను వివరణ కోరగా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వలేదని.. రెవెన్యూ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఆర్‌ఎంఓల నియామకం
భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నలుగురు ఆర్‌ఎంఓలను నియమించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రాజేష్ ఆర్‌ఎంఓ–1, డాక్టర్ నాగా శశికాంత్ ఆర్‌ఎంఓ–2, డాక్టర్ మృదుల అరుణ్ ఆర్‌ఎంఓ–3, డాక్టర్ పవన్‌కుమార్ ఆర్‌ఎంఓ–4లను నియమించి వివిధ విభాగాల బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
టెక్నికల్ కోర్సు పరీక్షలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు డ్రాయింగ్ లోయర్ పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హయ్యర్, లోయర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ప్రతిభ
కాళేశ్వరం: కామారెడ్డి జిల్లాకేంద్రంలో జనవరి 7, 8, 9 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మహదేవపూర్ గ్రీన్‌వుడ్ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. సంతోషపు నైసి, వెన్నపురెడ్డి మధుప్రియ రీక్రియేషనల్ మాథమెటికల్ థింకింగ్ విభాగంలో ‘గోల్డెన్ రేషియో’ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం చీర్ల శ్రీనివాస్‌రెడ్డి గైడ్ టీచర్ మొగిలి విద్యార్థులను అభినందించారు.
గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ములుగు రూరల్ : ఆది దేవత గట్టమ్మ తల్లిని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ దర్శనానికి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఆయన మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి ఒడిలో కొలువైన గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
హేమాచలుడి
వరపూజకు ఆహ్వానం
మంగపేట : మల్లూరు హేమాచల క్షేత్రంలో ఈనెల 15న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవం (పెళ్లిచూపులు) కార్యక్రమానికి రావాలని ఈఓ రేవెల్లి మహేష్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. ప్రతి ఏటా హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకులు కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ డంపులు


