భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

ఉప్పల్‌: కుటుంబ కలహాలు, భర్త వేధింపులతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని పసరమడ్ల గ్రామానికి చెందిన నంద సత్తయ్య మూడో కుమార్తె కడకంచి మాధవి (32)కి జిల్లాలోని షామీర్‌పేటకు చెందిన కడకంచి శ్రీధర్‌తో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. పన్నేండేళ్ల కుమారుడు శశి, పదేళ్ల కుమార్తె శైలజ ఉన్నారు. వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇరు కుటుంబాల పెద్దలు పలుమార్లు సర్దిచెప్పారు. కుమార్తె, మనవళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సత్తయ్య తన కుమార్తె పేరుపై అదనపు కట్నంగా ఎకరం భూమిని కూడా రిజిస్ట్రేషన్‌ చేయించారు. అయినప్పటికీ అల్లుడి ప్రవర్తనలో మార్పు రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన మద్యం తాగిన శ్రీధర్‌ తనకు ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, కుమార్తెను తమ ఇంటికి తీసుకెళ్లాలని, విడాకులు ఇస్తానని బెదిరించినట్లు సత్తయ్య తెలిపారు. ఈ నెల 23వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మాధవి, శ్రీధర్‌ మధ్య గొడవలు జరిగినట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో శ్రీధర్‌ అన్న కడకంచి రాజు ఫోన్‌ చేసి మాధవి చీరతో ఫ్యాన్‌న్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం ఇచ్చాడన్నారు. వెంటనే విజయపురి కాలనీలోని కుమార్తె ఇంటికి వెళ్లగా, అప్పటికే మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసిందని తండ్రి సత్తయ్య పేర్కొన్నారు. భర్త వేధింపులు, తరచూ జరుగుతున్న కుటుంబ కలహాల కారణంగానే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, అల్లుడు శ్రీధర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement