జన చైతన్య సభ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

జన చైతన్య సభ విజయవంతం

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

● కాంగ్రెస్‌ పాలనపై

కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు

● బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి ప్రజల

ముందుకు..

● ఏకశిల విద్యా సంస్థల చైర్మన్‌

గౌరు తిరుపతిరెడ్డితో సహా

పలువురి చేరిక

హన్మకొండ: హనుమకొండలోని కేడీసీ మైదానంలో ఆదివారం సాయంత్రం జరిగిన బీఆర్‌ఎస్‌ జనచైతన్య సభ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మైదానం కిక్కిరిసిపోయింది. సాయంత్రం 6.38 గంటల నుంచి రాత్రి 7.10 గంటల వరకు కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను స్క్రీన్‌పై ప్రదర్శించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వరంగల్‌లో జరిగిన అభివృద్ధిని విజువల్‌ రూపంలో చూపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌లో ఫార్మాసిటీ కోసం స్థల సేకరణ చేస్తే రియల్‌ ఎస్టేట్‌ కోసం ఫ్యూచర్‌ సిటీ చేస్తామని చెబుతున్నారని, ప్రజలు దయ తలిచి అవకాశమిస్తే వరంగల్‌ను ఫ్యూచర్‌ సిటీగా చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. 2001లో తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటిసారి కేడీసీ మైదానంలో నిర్వహించిన సభ విజయవంతమైందని తెలిపారు. మోసం చేయడమే రేవంత్‌ నైజమని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేక రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ క్రమంలో వరంగల్‌లో కూడా మేధావులు, ఆయా పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. 2021లో మాట ఇచ్చిన మేరకు 24 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించానని పేర్కొన్నారు. తనకు అవకాశమిస్తే ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయిలో 26 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు. ఏకశిల విద్యాసంస్థల చైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ పనితిరు, నిబద్ధత తనను తట్టిలేపిందన్నారు. తన రాజకీయ ప్రవేశం పదవుల కోసం కాదని, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి సేవ చేయడమేనన్నారు. తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించిన అకుంఠిత దీక్షతో పని చేస్తానన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పొచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్‌.రెడ్యానాయక్‌, తాటికొండ రాజయ్య, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాలోత్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన వారు..

విద్యావేత్తలతోపాటు ఆయా పార్టీల నుంచి పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఏకశిల విద్యా సంస్థల చైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి, భేతి కొండల్‌ రెడ్డి, ఆయా పార్టీల నాయకులు వస్కుల బాబు, బోగి సువర్ణ, జక్కుల రాజుయాదవ్‌, అరుణ, సత్యనారాయణ, కుమారస్వామి, సాయిలు, వీర భిక్షపతి, జాన్‌వెస్లీతో పాటు పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement