లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ రామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 23న (సోమవారం) రాత్రి గల్లపూజతో వేదపండితులు బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. 24న జీడిగుండం, పాలగుండాలలో భక్తులు కార్తీక పౌర్ణమి పుష్కర స్నానాలు చేస్తారు. ఈ నెల 28న రామచంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించి డిసెంబర్ 5వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అందుకు భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్యేక చొరవ తీసుకొని ఇప్పటికే రెండుసార్లు అధికారులతో సమీక్షించి ఆర్డీఓ గోపీరామ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దేందుకు రంగుల పూల మొక్కలను నాటించారు. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కోసం ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి కల్యాణోత్సవం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లతో బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. సుమారు రూ.8 కోట్లతో చేపట్టిన జీడికల్ – జనగామ రోడ్డు పనులను ప్రారంభించి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డును పూర్తి చేయించారు.
నేటి రాత్రి లక్ష్మీపూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రేపు కార్తీక పౌర్ణమి పురష్కర స్నానాలు


