జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు సమయపాలనపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రతీరోజు ఉదయం 10.30 గంటల వరకే మార్కెట్ గేట్ తెరిచి ఉంచడంతోపాటు, అదే సమయం వరకు మాత్రమే ధాన్యం విక్రయానికి సంబంధించిన లాట్ చిట్టీలు జారీ చేయనున్నారు. 10.30 గంటల తర్వాత వచ్చే రైతులకు లాట్ చిట్టీలు ఇవ్వబోమని అధికారులు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ నిబంధనలు నేటి (శనివారం) నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ‘ధాన్యం పోటెత్తుతున్నా.. పట్టించుకునే వారేరి?’ శీర్షికన ఈనెల 20న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మార్కెట్‌లో కొనుగోళ్ల ప్రక్రియను క్రమబద్ధీకరించడంతోపాటు రైతులు, హమాలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు నిబంధనలను కఠినతరం చేశారు. ప్రతీరోజు బిడ్డింగ్ సమయాన్ని పొడిగించడం, కాంటాలు ఆలస్యం కావడంతో రైతులు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజుల క్రితం నిలిచిపోయిన కాంటాలతోపాటు శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన సుమారు 3,900 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులు, అడ్తిదారులు ఈ నిబంధనలను గమనించి నిర్ణీత సమయంలోనే ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చి సహకరించాలని అధికారులు కోరారు.
ఉదయం 10.30 గంటల వరకే గేట్ ఓపెన్
ఆ తర్వాత లాట్ చిట్టీలు బంద్
నేటినుంచి నిబంధనలు అమలు


