ముంచుకొస్తున్న కరువు
జనగామ: వర్షాభావ పరిస్థితులు జిల్లాలోని జలవనరులపై ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు వర్షాలు లేక భూములు ఎండిపోతుండగా, మరోవైపు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాగునీటికి, భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు జలవనరులే ఆధారం కాగా, వాటిలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడం కరువు పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇరిగేషన్ శాఖ ఈ నెల 18న విడుదల చేసిన నీటిమట్టాల నివేదికలు జిల్లాలోని పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి.
కరువు ముంచుకొస్తున్న వేళ
జిల్లాలో ప్రస్తుత నీటి నిల్వలను పరిశీలిస్తే జిల్లాలో కరువు ప్రభావం ఒక్కసారిగా కాకుండా క్రమంగా తీవ్రతరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. చెరువుల్లో సగానికి పైగా నీరు లేని పరిస్థితి భూగర్భజలాలపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే నీటి వనరులపై ఆధారపడిన రైతులు పంటల సాగు విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్లలో ప్రస్తుతం కొంతమేర నిల్వలు ఉన్నప్పటికీ వర్షాలు లేకపోతే వాటి వినియోగంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా యాసంగి సాగు, పశువుల తాగునీరు, గ్రామీణ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే నీటి వినియోగంపై ప్రణాళిక రూపొందించాలి. లేదంటే వేసవి ప్రారంభానికే జలసంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
771 చెరువుల్లో 384లో పాతాళానికి నీరు
జిల్లా పరిధిలోని 12 మండలాల్లో మొత్తం 771 మధ్యతరహా చెరువులు ఉండగా, వీటి ఆయకట్టు 50,416 ఎకరాలు. వీటిలో 384 చెరువుల్లో 0–25 శాతం మాత్రమే నీరు ఉంది. మరో 197 చెరువుల్లో 25–50 శాతం నీరు నిల్వ ఉంది. 91 చెరువుల్లో 50–75 శాతం, 96 చెరువుల్లో 75–100 శాతం నీరు ఉంది. కేవలం మూడు చెరువులు మాత్రమే మత్తడి స్థాయికి చేరి మిగులు జలాలను కలిగి ఉన్నాయి. అంటే జిల్లాలో 581 చెరువుల్లో నీటి నిల్వలు 50 శాతానికి మించలేదు.
పాలకుర్తి, దేవరుప్పలలో పరిస్థితి దారుణం
మండలాల వారీగా పరిశీలిస్తే పాలకుర్తిలో 89 చెరువులకు గాను 68 చెరువుల్లో పాతిక శాతంలోపే నీరు ఉంది. దేవరుప్పలలో 79కి 51, బచ్చన్నపేటలో 83కి 54, లింగాలఘణపురంలో 56కి 45, కొడకండ్లలో 39కి 29 చెరువులు ఈ జాబితాలో ఉన్నాయి. జనగామ మండలంలో 67 చెరువులకు గాను 41, తరిగొప్పులలో 39కి 24 చెరువుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నీటి నిల్వలు తగ్గడంతో వ్యవసాయ అవసరాలపై ప్రభావం చూపే అవకాశముంది.
గతేడాదితో పోలిస్తే ..
గతేడాది నివేదికతో పోలిస్తే ప్రస్తుతం చెరువుల పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తోంది. అప్పట్లో 769 చెరువుల్లో 670 చెరువుల్లో పాతిక శాతం లోపే నీరు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 384కు తగ్గింది. అయినప్పటికీ ప్రస్తుతం 75 శాతానికి పైగా చెరువుల్లో నీటి నిల్వలు సగానికి మించకపోవడం ఆందోళనకరం. వర్షాలు కురవకపోతే భూగర్భజలాలు మరింత అడుగంటడంతో పాటు బోర్లు, బావులపై ఆధారపడే రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటి నుంచే అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించడం, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమివ్వడం, చెరువుల నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించడం అత్యవసరంగా మారింది.
ప్రధాన రిజర్వాయర్లలోనూ తగ్గిన నిల్వలు
జిల్లా పరిధిలోని ప్రధాన రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ఈ నెల18 నాటి నివేదిక ప్రకారం గండిరామారం రిజర్వాయర్‌లో 70.93 శాతం, బొమ్మకూరులో 69.72శాతం, చీటకోడూరులో 83.95 శాతం, నవాబుపేటలో 73.84 శాతం నీరు ఉంది. ఆర్.ఎస్.ఘన్‌న్‌పూర్‌లో 58.40 శాతం, అశ్వరావుపల్లిలో 60.40 శాతం, కన్నబోయినగూడెంలో 80.40 శాతం, వెల్దండలో 75.30 శాతం, నష్కల్‌లో 55.29 శాతం నిల్వ ఉంది.
ఎండుతున్న చెరువులు... పొంచిఉన్న జలగండం
384 చెరువుల నీటిమట్టం 25 శాతంలోపే
50 శాతం లోపే నీరున్న చెరువులు 581
ప్రధాన రిజర్వాయర్లలోనూ తగ్గిన నీటి నిల్వలు


