చిల్పూరు: కార్తీక మాసం పురస్కరించుకుని బుధవారం చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కమీషన్ కోసం ఆందోళన చెందొద్దు
సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హతీరామ్
లింగాలఘణపురం:గత యాసంగి (రబీ) సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులు తమకు రావాల్సిన కమీషన్ కోసం ఆందోళన చెందవద్దని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హతీరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ‘సాక్షి’ దినపత్రికలో ‘యాసంగి కమీషన్ ఏదయ్యా?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి డీఎం స్పందిస్తూ జిల్లాలోని 12 మండలాల్లో కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన వారి కమీషన్‌కు సంబంధించిన లెక్కలన్నీ పరిశీలించి ఉన్నతాధికారులకు పంపించేందుకు సిద్ధం చేశామని, నిధులు చెల్లించేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. నిబంధనల ప్రకారం కమీషన్ పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.
పీఆర్సీ అమలుకు ఉద్యమించాలి
జనగామ రూరల్: రెండో పీఆర్సీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేస్తోందని, వెంటనే పీఆర్సీ అమలుచేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. శ్రీధర్ అధ్యక్షతన బుధవారం పట్టణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రశేఖర్ రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం పీఆర్సీ విషయంలో దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నదని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. అనంతరం నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా బి.దేవ,ప్రదాన, కార్యదర్శిగా జి.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ఎన్.భగవాన్‌రెడ్డి, ఆర్. మమత, కోశాధికారిగా జి.నాగరాజు, కె.ఎల్. మర్రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు.
అన్నదాతల సంక్షేమ పురోగతితోనే దేశాభివృద్ధి
జేఎంఐ వ్యవస్థాపక సభ్యుడు
కొనగల రమేశ్
దేవరుప్పుల: అన్నదాతల సంక్షేమ పురోగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుడు కొనగల రమేశ్ అన్నారు. బుధవారం మండలంలోని ధర్మాపురం, మున్‌పహాడ్ సందర్శనకు వెళ్లగా గ్రామ పాలకవర్గం డప్పు చప్పుళ్లతో, భారీ ర్యాలీతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక జీవనోపాధులు, మహిళలు, రైతులకు ఉన్న నూతన ఉపాధి అవకాశాలపై ఆయన గ్రామస్తులతో సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు దౌపాటి అశ్వినిరవి, పాకుపెల్లి బాలమ్మ శ్రీనివాస్, జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కన్నారపు పరుశరాములు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంగిరేకుల శ్రీకాంత్, జిల్లా కన్వీనర్ గాదేపాక శ్రీనివాస్, కో–కన్వీనర్లు తోడేటి ఆంజనేయులు, ఎండీ రబియా, మండల జేఎంఐ సభ్యులు బోనగిరి యాకస్వామి, పి. స్వరూప తదితరులు పాల్గొన్నారు.


