ప్రతీ కుటుంబానికి బీమా ధీమా | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కుటుంబానికి బీమా ధీమా

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

జనగామ రూరల్‌: కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయిన పేద కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోకుండా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. కుటుంబ పెద్ద అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా జిల్లాలో అర్హుల గుర్తింపు దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన కుటుంబాలను గుర్తించి దరఖాస్తుల స్వీకరణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. లబ్ధిదారుల వయసు నిర్ధారణకు ఆధార్‌ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నారు. అయితే దరఖాస్తుకు ప్రామాణికంగా రేషన్‌కార్డు తీసుకోగా రేషన్‌కార్డులేని వారికి కుటుంబ పెద్ద ఉన్న వారికి అవకాశం ఉంది. రేషన్‌కార్డు ఈకేవైసీ పెండింగ్‌లో వారు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతం రేషన్‌కార్డులు ఉన్న కుటుంబాలు 1,89,236 ఉన్నాయి. వీటితోపాటు రేషన్‌ కార్డులు లేని ఉద్యోగులు, ధనిక కుటుంబాలు మరో 10 వేలకు పైగా ఉంటాయని అంచనా. ఈ పథకం కింద జిల్లాలో సుమారు 2 లక్షల కుటుంబాలకు భరోసా అందనుంది.

గ్రామాల్లో నాలుగు వారాల పాటు క్యాంపులు

బీమా పథకం అమలులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల పరిధిలో క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీరాజ్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఈ మేరకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌ వార్డుల్లో వార్డు ఆఫీసర్‌ క్యాంపు ఇన్‌చార్జులుగా ఉంటారు. 19 నుంచి డిసెంబర్‌ 5 వరకు క్యాంపులు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 16 నుంచి 18 వరకు వివరాల పరిశీలిన డూప్లికెట్‌ నమోదు తొలగింపు రికార్డుల భద్రపరిచే ప్రక్రియ చేపట్టనున్నారు.

కుటుంబంలో ఒక్కరికే..

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింది కుటుంబంలో ఒకరి పేరు మీద ప్రభుత్వం బీమా సౌకర్యం ఉంటుంది. కుటుంబ పెద్దదిక్కుగా ఉంటూ సంపాదించే వారిపై బీమా చేయనున్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందనుంది. కుటుంబంలో ఎవరి పేరు మీద బీమా చేయాలన్న దానిపై కుటుంబ సభ్యులంతా ఒక అభిప్రాయానికి వచ్చి వారి పేరు మీదనే బీమా చేయించాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒక్కరే ఉంటే ఆ ఒక్కరిపైనే బీమా చేస్తారు. బీమా చేసిన వ్యక్తికి నామినీగా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పెట్టుకునే అవకాశం కూడా ఉంది.

నిబంధనలు ఇలా..

బీమా చేయించే వ్యక్తి వయస్సు 18 నుంచి 59ఏళ్ల మధ్య ఉండాలన్న నిబంధన ఉంది. 19–11–1967 నుంచి 18–11–2008 మధ్య పుట్టిన వారు అర్హులు. బీమా పొందే వ్యక్తి స్వయంగా వివరాలు అందించాలి. దరఖాస్తుపై సంతకం తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డుతో పాటు మొబైల్‌ నంబర్‌, నామినీలు ఎక్కువ మంది ఉంటే వారికి వర్తించే వాటా స్పష్టంగా తెలియజేయాలి. రేషన్‌కార్డులో పేరు లేకపోతే నామిని బీమా పొందే వ్యక్తి సంతకంతో చేసుకోవాలి. అనారోగ్యరిత్యా రాలేని వారి వివరాలు నమోదు చేసి ఉన్నత అధికారులకు తెలిపాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌లో టోల్‌ఫ్రీ నంబర్‌ 18004256605ను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సంప్రదించవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం పేద అర్థిక వెసులుబాటుకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేయనుంది. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతిఒక్కరూ గ్రామ శిబిరాలలో నమోదు చేసుకోవాలి. ఈపథకం పేదలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

–సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

ఆర్థిక వెసులుబాటు

కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే పిల్లల చదువులు, కుటుంబ పోషణ, రోజువారీ అవసరాల కోసం మిగిలిన సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.5లక్షల బీమా పరిహారం అందించడం ద్వారా ఆ కుటుంబానికి కొంత ఆర్థిక వెసులుబాటు కలగనుంది. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కు మేలు చేసేందుకు ఇందిరమ్మ బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలకు సైతం భూ ములతో సంబంధం లేకుండా ఆధార్‌ కార్డుతోనే వివరాలు నమోదు చేయనున్నారు.

కుటుంబ పెద్ద మరణిస్తే

రూ.5 లక్షల ఆర్థిక సాయం

18–59 ఏళ్ల వారికి వర్తింపు

గ్రామాల్లో నాలుగు వారాల పాటు ప్రత్యేక శిబిరాలు

రేపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

పేద కుటుంబాలకు భరోసా

కల్పించనున్న రాష్ట్ర ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement