జనగామ: ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీ జానపరెడ్డి కృష్ణవేణి, కేయూ మాజీ డీన్ ఆచార్య గాదె సమ్మయ్య తెలిపారు. సోమవారం ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనగామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, మాదకద్రవ్యాల దుర్విని యో గం, ఫార్మసిస్టుల సామాజిక బాధ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైద్యుల సూచనలు లేకుండా యాంటీబయాటిక్ మందులను వినియోగించడం వల్ల యాంటీబయాటిక్ నిరోధకత పెరిగి భవిష్యత్తులో సాధారణ ఇన్‌ఫెక్షన్లకు సైతం చికిత్స చేయడం కష్టతరమవుతుందన్నారు. ఔషధాలను సరైన మోతాదులో, సరైన సమయంలో అందించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విజయకుమార్, చైర్మన్ డాక్టర్ లవకుమార్‌రెడ్డి, అధ్యాపకులు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.


