జిల్లాలో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
జనగామ: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ప్రజలు గజగజవణుకుతున్నారు. పగటిపూట కొద్దిసేపు ఎండ ఉపశమనం కలిగిస్తున్నా, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి పంజా విసురుతోంది.
ఆస్పత్రులకు పెరుగుతున్న రోగులు
చలి ప్రభావంతో చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతూ కొందరు రోజుల తరబడి మంచానికే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్యతో పాటు ఓపీ సేవలు కూడా పెరుగుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోనూ జన సంచారం తగ్గుతోంది. రాత్రి 7 గంటలు దాటిందంటే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు స్వెటర్లు, జర్కిన్లు, మఫ్లర్లు, టోపీలు వినియోగిస్తున్నారు. నేపాల్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి ఉన్ని దుస్తుల విక్రయాలు చేస్తున్నారు.
విద్యుత్ ఖర్చులకు అదనపు భారం
చలి కారణంగా కూలర్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగానికి కుటుంబాలు స్వస్తి పలికాయి. అయితే వేడి నీటి కోసం గీజర్లు, హీటర్లు, గ్యాస్ స్టవ్‌లు, కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీంతో గీజర్లు, హీటర్ల వినియోగం పెరిగి విద్యుత్ ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. రాత్రిపూట ప్రయాణించే వారు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో బస్సులు, రైళ్ల కోసం నిరీక్షిస్తూ చలితో అవస్థలు పడుతున్నారు. మరోవైపు మూగ జీవాల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. వానరాలు, వీధి కుక్కలు, పాడి పశువులు, అటవీ ప్రాంతాల్లోని జంతువులు చలికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామాల్లో వేల సంఖ్యలో ఉన్న కోతులు రాత్రివేళ గుంపులుగా ఒకేచోట చేరి చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జిల్లా ప్రజలకు చలి కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉన్ని దుస్తులు ధరించడం, చెవులు, ముక్కు, ముఖానికి చలి తగలకుండా చూసుకోవడం చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులతో జనజీవనం క్రమంగా చలికి అనుగుణంగా మారుతోంది.
చిన్నారులు,వృద్ధులపై ప్రభావం
గీజర్లు, హీటర్లకు పెరుగుతున్న డిమాండ్
జోరందుకున్న ఉన్ని దుస్తుల వ్యాపారం
రాత్రి 8 గంటలకే నిర్మానుష్యంగా
మారుతున్న రహదారులు
తేదీ కనిష్ట ఉష్ణోగ్రతలు
11 16నుంచి18
12 17నుంచి18
13 14.8నుంచి16.7
14 15నుంచి17
15 15.2నుంచి17.8


