ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు జిల్లా నుంచి నలుగురు ఎంపిక
జనగామ: వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన సాగు, పాడి పరిశ్రమల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న జిల్లా రైతులకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన (పీఎం–డీడీకేవై)లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న జిల్లాల్లో జనగామ ఆరో స్థానంలో నిలవడంతో జిల్లా నుంచి నలుగురు రైతులకు ఢిల్లీలో 2027లో జరిగే 78వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆర్థిక సలహాదారు రాజీందర్ కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి పంపిన అధికారిక లేఖలో జనగామ జిల్లాను రాష్ట్రంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పీఎం–డీడీకేవై జిల్లాగా పేర్కొన్నారు. జిల్లా నుంచి నలుగురు రైతులను ఎంపిక చేసి వివరాలు పంపించాలని కోరారు. ఈ మేరకు రైతుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్ ప్రతులు, పాస్‌పోర్టు సైజు ఫొటోలను నవంబర్ 10లోగా పంపించాలని సూచించారు.
నలుగురు రైతుల ప్రత్యేకత ఇదే..
జిల్లాలోని లింగాలఘణపురం మండలం జీడికల్‌కు చెందిన మైలారపు వెంకన్న ప్రకృతి సహజసిద్ధమైన వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ విశేష గుర్తింపు పొందుతున్నారు. ఆయన సతీమణి మైలారపు పద్మ బయో రీసెర్చ్ రంగంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా కొడకండ్ల గ్రామానికి చెందిన సర్వను నాయక్ ఉద్యానవన వ్యవసాయంలో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ విప్లవాత్మక మార్పులకు కృషి చేస్తున్నారు. దేవరుప్పుల మండలానికి చెందిన పాడి రైతు కె.ధర్మారెడ్డి పాడి పరిశ్రమ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులతో పాటు వారి జీవిత భాగస్వామ్యులకు ఢిల్లీలో జరిగే వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు.
11 శాఖలు.. 36 పథకాల అమలు
పీఎం–డీడీకేవైని కేంద్ర ప్రభుత్వం 2025–26 బడ్జెట్‌లో ప్రకటించింది. ఆరేళ్ల పాటు అమలయ్యే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ ప్రధాన జిల్లాలను ఎంపిక చేయగా, ఇందులో జనగామ ఒక్కటి. పంటల దిగుబడులు, సాగు తీవ్రత, వ్యవసాయ రుణాల లభ్యత వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో వివిధ శాఖల పనితీరు, పథకాల అమలు పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఈక్రమంలో జాతీయ స్థాయిలో జిల్లా ఆరో స్థానంలో నిలవడం విశేషం. వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులను జాతీయ వేడుకలకు ఆహ్వానించే నిర్ణయం గ్రామీణ వ్యవసాయానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. జిల్లా రైతుల ప్రతిభకు దేశ రాజధానిలో గుర్తింపు లభించడం గర్వకారణం.
జిల్లా రైతులకు అరుదైన అవకాశం
పీఎం ధనధాన్య పథకంలో జిల్లాకు గుర్తింపు
జాతీయ స్థాయిలో ఆరో స్థానం
సాధించి సత్తా
ప్రకృతి వ్యవసాయం నుంచి పాడి పరిశ్రమ వరకు..
రైతుల ఎంపికతో గ్రామీణ వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కొడకండ్ల మండలం చెరువు ముందు తండాకు చెందిన ధరావత్ సర్వను నాయక్. ఈయనకు 5ఎకరాల16 గుంటల వ్యవసాయ భూమి ఉంది. తక్కువ నీటితో అధిక లాభాలు పొందే మార్గాన్ని ఎంచుకున్నారు. 25 ఏళ్లుగా సేంద్రీయ పద్ధతిలో మూడు ఎకరాల్లో మిర్చి, బెండ, కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ పద్ధతి ద్వారా కూరగాయల సాగుతో పెట్టుబడులు పోను, రూ.7లక్షల ఆదాయం పొందుతున్నారు. పంటలకు ఆవు పేడ, మూత్రం, వేప నూనె, పుట్టమట్టి, అరటి పండ్లు ఇంగువతో కషాయాన్ని తయారు చేసి పిచికారి చేస్తూ సేంద్రీయ సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు.


