జనగామ: ప్రకృతి పరిరక్షణ, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈనెల 14న (శనివారం) రన్ ఫర్ నేచర్–రన్ ఫర్ ఫ్యూచర్ నినాదంతో ప్లానెట్ రన్–2026 నిర్వహించనున్నట్లు వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. ఉదయం 6 గంటలకు పట్టణంలోని బతుకమ్మకుంట నుంచి ప్రారంభమై సిద్దిపేట రోడ్డులోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, అలాగే డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్, సీఐ సత్యనారాయణరెడ్డితో పాటు వాకర్స్, ప్రముఖులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్, మెడల్ అందజేయనున్నారు.
బాలల ఆరోగ్య టీకాలపై శిక్షణ
జనగామ రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో గురువారం ఏఎన్‌ఎమ్‌లకు వైద్యాధికారులకు యూ విన్ పోర్టల్ బాలల ఆరోగ్య టీకాల కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.వాణిశ్రీ మాట్లాడుతూ..యూ విన్ పోర్టల్ ద్వారా గర్భిణులు, శిశువుల టీకాల నమోదు, టీకాల షెడ్యూల్ నిర్వహణ, టీకాల వివరాల డిజిటల్ నమోదు తప్పనిసరి చేయాలని, టీకాల పర్యవేక్షణ వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఉప్పుగల్లు విద్యార్థి
జఫర్‌గఢ్: మండలంలోని ఉప్పుగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి మహమ్మద్ ఇలియాస్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఫరహత్‌కౌసర్ గురువారం తెలిపారు. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ఇలియాస్ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అండర్ –17 కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రస్థాయికి ఎంపికై న ఇలియాస్‌ను ఉపాధ్యాయులతో పాటు తోటి విద్యార్థులు అభినందించారు.
వాలీబాల్ పోటీలకు ముత్తారం విద్యార్థులు
పాలకుర్తి టౌన్: రాష్ట్ర స్ధాయి అండర్–14 వాలీబాల్ పోటీలకు ముత్తారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 13,14,15న నిర్వహించే 70వ తెలంగాణ రాష్ట్ర స్ధాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు ఉదయ్, స్వాతిక్ ఎంపికైనట్లు హెచ్‌ఎం బి.సంజయ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పీఈటీ మనోహర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు.
గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో రెండు సబ్జెక్టుల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, కళావిద్య (తెలుగు అండ్ ఇంగ్లిష్ మీడియం, వేతనం రూ.15,660) బోధనకు, పెడగాజి ఆఫ్ సైన్స్ ఉర్దూమీడియం(వేతనం రూ.23,400)లో ఒక పోస్టు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తిచేసి ఈనెల 13నుంచి 16వ తేదీ దరకు సమర్పించాలని కోరారు. మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో ఈ నెల 19న డెమో/ఇంట ర్వ్యూలు ఉంటాయని, ఎంపికై న వారిని 20న ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వ బీఈడీ కళాశాలలో..
హనుమకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఆరోగ్యం శారీరక విద్య ఒకపోస్టు తాత్కాలిక పద్ధతిన గెస్ట్ లెక్చరర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు తెలిపారు.


