గడువులోగా పూర్తిచేయాలి
జనగామ రూరల్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మేల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల వారీగా వివిధశాఖల పనుల పురోగతిపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా మంజూరైన పనులు, ప్రారంభమైన పనులు, పూర్తయిన పనులు, వివిధ దశల్లో పురోగతిలో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంజూరైన ఇళ్లలో ఇప్పటికే గ్రౌండింగ్ అయినవి, నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నవి, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల వివరాలను పరిశీలించి, ప్రతీ లబ్ధిదారుడి నిర్మాణ పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. రెండో విడత గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు, మంజూర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారి కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీరు. రోడ్లు, విద్యుత్ సరఫరా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్ప నపై సమీక్షించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. పాఠశాలల ప్రహరీ నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జెడ్పీ సీఈఓ బాలరామ రావు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్, వివిధశాఖల ఆధికారులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


