జనగామ రూరల్: క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల పనిచేసేతత్వాన్ని పెంపొందిస్తాయని చదువుతో పాటు కనీసం ఒక క్రీడను తప్పనిసరిగా ఎంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 బాలబాలికల రాష్ట్రస్థాయి సెపక్ తక్రా టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ –2026 పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సెపక్ తక్రా ఒక వినూత్నమైన, కఠినమైన క్రీడ అని, అద్భుతమైన శారీరక నైపుణ్యం, చురుకుదనం, విన్యాసాలు అవసరమవుతాయని తెలి పారు. గెలుపోటములను సమానంగా స్వీకరించ డం, జట్టుగా పనిచేయడం, స్నేహభావం, కష్టపడేతత్వం వంటి విలువలు క్రీడల ద్వారా అలవడతాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో సుమారు 10 జిల్లాల నుంచి 100 మంది బాలబాలికల క్రీడాకారులు పాల్గొని, తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ సింగ్, ఆర్టీ ఏ సభ్యులు అభిగౌడ్, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీవైఎస్‌ఓ నరసింహారావు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి గోర్ సింగ్, వివిధ జిల్లాల పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు
ప్రారంభం


