ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం
జనగామ రూరల్: ఎల్‌నినో పరిస్థితుల్లో వరి పంట వేయకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడమే మేలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా ఈ సమయానికి జిల్లాలో సుమారు 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 525 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దాదాపు 40 శాతం లోటు వర్షపాతం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడి తప్పనిసరి అని, వరి పంట వేయకుండా ప్రత్యామ్నయ మార్గాలు అవలబించేలా ఇప్పటికే వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం పెంచేలా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆయా అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన
రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, శిక్షణ కల్పించడం భూసార పరీక్షలు చేయించుకొని, నేల స్వభావానికి అనుగుణంగా పంటలు సాగుతో పాటు, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచించి రాయితీలను అందిస్తోంది.
ఆయిల్ పామ్ సాగు లాభదాయకం
నాలుగేళ్లలో జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయగా ఎకరానికి ఏడాదికి రూ.4,200 నిర్వహణ ఖర్చుల రాయితీ, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు మొదటి సంవత్సరంలో రూ.22,900 సబ్సిడీ అందిస్తోంది. మొక్కలపై 90 శాతం సబ్సిడీ కల్పిస్తున్నారు. జిల్లాలో సుమారు 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట అందుబాటులోకి వచ్చింది. గత మూడేళ్లలో ఇప్పటివరకు సుమారు రూ.58 కోట్ల మేర రైతులకు చెల్లింపులు జరిగాయి.
ఉద్యానవన పంటలతో అధిక ఆదాయం
ఉద్యానవన పంటలతో రైతులకు నీటి వినియోగం తక్కువ అవసరం కాగా తక్కువ కాలంలో అధిక ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో 19,432 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ఇందులో ఆయిల్ పామ్ సాగును 2,343 మంది రైతులు 7,905 ఎకరాల్లో చేస్తున్నారు. రాయితీ కింద నాలుగేళ్లకు గాను రూ.22,11,55,000 మంజూరు చేశారు. ఉద్యానవన పంటలకు సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, స్టేట్ బాంబూ మిషన్, పట్టుపురుగుల పెంపకం వంటి పథకాలు అమలు చేస్తున్నారు.
రైతులు దృష్టి సారించాలి..
జిల్లాలో లోటు వర్షపాతం ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి. ఆయిల్‌పామ్, పట్టు, కూరగాయలు, పండ్ల తోటల పెంపకం, చిరుధాన్యాల పంటలు వేసుకోవాలి. నీటి లభ్యతను బట్టి పంట సాగు చేసుకోవాలి. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను ఉపయోగించుకోని లాభం పొందాలి. – డి నర్సయ్య,
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి
ప్రస్తుతం రైతులు వర్షాభావ ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు చేపట్టాలని ప్రభుత్వం చెబుతుండడంతో రైతులు ఆ పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆరుతడి పంటల సాగుతో నేలలో ఉత్పాదకశక్తి, భూసారం పెరుగుతుంది. నేల కోతకు గురయ్యే అవకాశం ఉండదు. భూమిలో తేమ చాలా కాలం నిల్వ ఉంటుంది. తద్వారా పంటలకు ఎక్కువగా నీటి తడులు అవసరం ఉండదు. బహుళ పంటల సాగుతో చీడ, పీడ భయం తగ్గుతుంది. నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు, మరో పంట రైతుకు రైతుకు ఆదాయాన్ని చేకూరుస్తుంది. 650 నుంచి 750 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండి, భూమిలో తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం 100 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే అంతర పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. కందిలో పొద్దు తిరుగుడును 1:2 నిష్పత్తిలో వేసుకుంటే ఆదాయం పెరుగుతుంది. అలాగే జొన్న, మొక్కజొన్నను 1:2 నిష్పత్తిలో వేసుకోవాలి. పెసర, మినుము, వేరుశనగ 1:7 నిష్పత్తిలో సాగు చేసుకోవాలి. వేరుశనగలో కంది, జొన్నను అంతర పంటగా వేసుకోవచ్చు.
వరికి బదులుగా ఉద్యాన, ఆరుతడి పంటలు వేయడమే మేలు
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచన


