లింగాలఘణపురం: ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ల నిర్వాహకులు వరి విత్తనాల విక్రయాలను తగ్గించి, ఆరుతడి పంటలు, కూరగాయాల సాగుపై రైతులను ప్రోత్సహించాలని డీఏఓ అంబికాసోని సూచించారు. బుధవారం మండలంలోని నెల్లుట్ల, పటేల్‌గూడెం, వడిచర్ల, లింగాలఘణపురం, జీడికల్ గ్రామాల్లోని ఆగ్రోస్, ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులతో పాటు, రైతులతో డీఏఓ మాట్లాడారు.. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజు ల్లో సాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రస్తుతం చెరువులు, కుంటల్లో ఉన్న నీటిని చూసి వరి సాగు చేయవద్దని, తాగునీటికే సరి పోతాయని వివరించారు. కూరగాయల సాగుతో పాటు పెసర్లు, మినుములు సాగు చేయాల ని సూచించారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేసుకొంటే నీటి వినియోగం తగ్గుతుందన్నారు. ఏఓ నజీరుద్ధీన్, ఏఈఓలు పాల్గొన్నారు.
పేదలకు అసైన్డ్ భూముల హక్కుల సాధనే లక్ష్యం
జనగామ: అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న పేదలు, రైతులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించడమే భూ రక్షణ సమితి ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూమి మైసన్న అన్నారు. జిల్లాలోని ఐదు మండలాలకు నూతన అధ్యక్షులను బుధవారం నియమించి నియామక పత్రాలు అందజేశారు. జనగామ మండల అధ్యక్షుడిగా కొమ్ము జగదీశ్, నర్మెటకు కోలేపాక సిద్దయ్య, రఘునాథపల్లికి నక్క సురేష్, పాలకుర్తికి గణిపాక రమేశ్, బచ్చన్నపేటకు మాదాసి భూపతిని నియమించారు. ఈ సందర్భంగా మైసన్న మాట్లాడుతూ.. అసైన్డ్ భూములపై ఉన్న ఆంక్షలు తొలగించి, లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించే వరకు సమితి పోరాటం కొనసాగుతుందన్నారు. నూతన అధ్యక్షులు గ్రామస్థాయిలో లబ్ధిదారులను చైతన్యపరిచి హక్కుల సాధనకు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు మిద్దెపాక మహేందర్ సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిద్దెపాక సిద్దులు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నత్తి కోర్నెల్, సిటీ ఇన్‌న్‌చార్జ్ నల్ల నర్సింగరావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చౌదగారి సంజీవ్ పాల్గొన్నారు.
రఘునాథపల్లి వాసికి రాష్ట్రస్థాయి పురస్కారం
రఘునాథపల్లి: విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న మండల కేంద్రానికి చెందిన గండ్ర శ్రీకాంత్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. నల్లగొండ జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల రీజినల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్‌లో 98 శాతం ఉత్తీర్ణత సాధించడంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించడంతో ప్రభుత్వం రాష్ట్రస్థాయి పురస్కారాన్ని అందజేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఉన్నత ప్రమాణాల కోసం మరింత అంకిత భావంతో పని చేస్తానన్నారు.
రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపిక
జనగామ రూరల్: ఈనెల 12(నేటి) నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి బి. వెంకటేష్ ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయుడు కనకయ్య తెలిపారు. వెంకటేశ్‌ను బుధవారం ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులు కరుణ, అనిత, శ్రీనివాసులు, చంద్రశేఖర్, తేహర జాన్, లక్ష్మి, లింగం, ఉమాదేవి, శేషుకుమార్, లలిత, హరిత అభినందించారు.


