మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

జనగామ: నాలుగు రోజుల సెలవుల అనంతరం వ్యవసాయ మార్కెట్‌ బుధవారం తిరిగి ప్రారంభమైంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ముహూర్తపు కొనుగోళ్లకు వ్యాపారులు శ్రీకారం చుట్టారు. మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి ధాన్యం కాంటా వేశారు. కొనుగోళ్లు ప్రారంభమైన తొలిరోజే మార్కెట్‌ ధాన్యంతో కళకళలాడింది.

తొలి ముహూర్తం

మోహన్‌న్‌లాల్‌ హరికృష్ణ అండ్‌ సన్స్‌ యజమానులు ద్వారకా బజాజ్‌, దినేష్‌ బజాజ్‌, వినోద్‌, గోవిందు ఆధ్వర్యంలో మార్కెట్‌ అధికారుల పర్యవేక్షణలో తొలి ముహూర్తపు ధాన్యం కాంటా వేశారు. బాణాపురం ఆలయ ప్రధాన పూజారి కృష్ణమాచారి మంత్రోచ్ఛరణ నడుమ ముహూర్తపు కొనుగోళ్ల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ చాంబర్‌లో ప్రత్యేక పూజలు జరిపారు.

తొలిరోజే భారీగా కొనుగోళ్లు

మార్కెట్‌ పునఃప్రారంభమైన తొలిరోజు 223 మంది రైతుల వద్ద దొడ్డు, సన్నరకాలకు చెందిన 7,283 క్వింటాళ్ల ధాన్యాన్ని (10,970 బ్యాగులు) రూపంలో కొనుగోలు చేశారు. మరో 13 మంది రైతుల వద్ద 20,079 బ్యాగుల మొక్కజొన్న కొనుగోళ్లు జరిగాయి. దొడ్డు ధాన్యానికి క్వింటాలుకు గరిష్టంగా రూ.2,366, కనిష్టంగా రూ.1,971 ధర పలికింది. సన్న రకానికి గరిష్టంగా రూ.2,801, కనిష్టంగా రూ.2,016 లభించింది. మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,927, కనిష్టంగా రూ.2,655 ధర నమోదైంది.

ధరలపై రైతుల అసంతృప్తి

మార్కెట్‌లో ధరల నిర్ణయంపై పలువురు రైతులు అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన ధాన్యానికి కూడా తక్కువ ధరకు బిడ్డింగ్‌ వేస్తున్నారని, అధికారులు నిరంతరం పర్యవేక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరారు. ఆశించిన ధర రాకపోవడంతో పలువురు రైతులు బిడ్డింగ్‌ను రద్దు చేసుకుని మరుసటి రోజుకు విక్రయాన్ని వాయిదా వేసుకున్నారు.

నాలుగు రోజుల సెలవుల తర్వాత కళకళ

ఒకేరోజు 7,283 క్వింటాళ్ల కొనుగోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement