వాస్తవాలను వక్రీకరించడం సరైంది కాదు | - | Sakshi
Sakshi News home page

వాస్తవాలను వక్రీకరించడం సరైంది కాదు

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

జనగామ: తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ మృతి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, కలెక్టర్‌ ద్వారా అబద్ధాలు ప్రచారం చేయించడం దుర్మార్గమని ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులు వెల్లడించిన సమస్యల ఆధారంగానే తాము స్పందించామని, వాటిని ఖండిస్తూ కలెక్టర్‌ పత్రికా ప్రకటన విడుదల చేయడం శోచనీయమన్నారు. లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి, బాధిత కుటుంబాన్ని మరింత ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడం సరి కాదన్నారు. భూ సమస్య 2017 నుంచి కోర్టులు, కలెక్టర్‌ కార్యాలయం పరిధిలో ఉందని కలెక్టర్‌ ప్రెస్‌నోట్‌లోనే పేర్కొన్నారని గుర్తుచేశారు. భూమిని విక్రయించేందుకు ప్రయత్నించినప్పుడు కోర్టు పరిధిలో ఉందంటూ అధికారులు అడ్డుకోవడం, స్లాట్‌ బుక్‌ కాకపోవడం వాస్తవమని తెలిపారు. అలాగే లక్ష్మణ్‌ గౌడ్‌కు చెందిన జేసీబీని అధికారులు పట్టుకుని సీజ్‌ చేయడం, కేసు నమోదు చేయడం కూడా వాస్తవమేనన్నారు. ఈ పరిణామాలతో ఆయనకు ఆర్థిక నష్టం జరిగిందని, జేసీబీని తక్కువ ధరకు విక్రయించుకోవాల్సి వచ్చిందన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో వివరణల పేరుతో వారిని మరింత బాధకు గురిచేయవద్దని ఎమ్మెల్యే కోరారు.

ఒక్క క్రీడలోనైనా నైపుణ్యం సాధించాలి

● కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝూ

● అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడాపోటీలు

జనగామ రూరల్‌: చదువుతో పాటు ఏ ఒక్క క్రీడలోనైనా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని సాధించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝూ సూచించారు. మండలంలోని పెంబర్తిలో మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అండర్‌ –14, అండర్‌– 17 జిల్లా స్థాయి క్రీడా పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ జ్యోతిప్రజ్వలన చేసి క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ..తరగతి గది విద్యార్థులకు ఎలా ఆలోచించాలో నేర్పితే ఆటస్థలం ఎలా జీవించాలో నేర్పుతుందన్నారు. క్రీడల ద్వారా ఓటమి ఎదురైనప్పుడు తిరిగి ఎలా నిలబడాలో, గెలుపోటములను సమానంగా స్వీకరించడం ఎలాగో అన్న విషయాలను నేర్చుకోవచ్చునన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల కోసం కూడా తగిన సమయాన్ని కేటాయించాలని చెప్పారు. ఈసీఓ శ్రవణ్‌, డీసీఓ శ్రీనివాస్‌, స్పోర్ట్స్‌ అఫీసర్‌ శ్రీనివాస్‌, పాఠశాల విజయ జ్యోతి, ఆయా పాఠశాలల ఫిజికల్‌ ఎడ్యుకేషనల్‌ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement