న్యూస్‌రీల్
జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన జనగామ వ్యవసాయ మార్కెట్ పాలన గాడితప్పుతోంది. వేలాది మంది రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు కీలక కేంద్రంగా ఉన్న ఈ మార్కెట్‌కు పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా వానాకాలం, యాసంగి పంటల దిగుబడులతో పాటు పత్తి కొనుగోళ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలతో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే ఈ మార్కెట్‌లో ప్రస్తుతం కనీస పర్యవేక్షణ కరువవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు తమ పంటలను విక్రయించుకునేందుకు రోజుల తరబడి మార్కెట్‌కు వస్తున్నా, వారికి అవసరమైన మౌలిక వసతులు, కొనుగోళ్లలో పారదర్శకత, తూకాల్లో పర్యవేక్షణ వంటి అంశాలపై ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదు. ఏళ్ల తరబడి కార్యదర్శుల కొరత, బదిలీలు, సస్పెన్షన్లు, ఇన్‌చార్జ్ పాలనతో మార్కెట్ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. మార్కెట్ ఆదాయాన్ని పెంచడం, వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, రైతులకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఇంతటి కీలకమైన మార్కెట్ నిర్వహణపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికై నా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.
15 పోస్టులు.. 12 ఖాళీలు
మార్కెట్ కమిటీ సిబ్బంది వివరాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. 15 రెగ్యులర్ పోస్టులు మంజూరుకాగా కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గ్రేడ్–3 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉండగా, కొడకండ్ల మార్కెట్ కార్యదర్శి శ్రీదేవి జనగామకు ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు సూపర్‌వైజర్ పోస్టులకు ఒకరు మాత్రమే పనిచేస్తుండగా, ఆయన కూడా వరంగల్‌లోని ప్రాంతీయ మార్కెటింగ్ ఉపసంచాలకుల కార్యాలయంలో ఇతర విధులు నిర్వహిస్తున్నారు. మూడు ఏఎంఎస్, ఒక జేఎంఎస్, గ్రేడర్, టైపిస్ట్, డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు అటెండర్లకు గాను ఒకరు మాత్రమే పనిచేస్తుండగా, ఒక వాచ్‌మన్ విధులు నిర్వహిస్తున్నారు. 15 పోస్టుల్లో 12 ఖాళీగా ఉండటం మార్కెట్ నిర్వహణపై ప్రభావం చూపుతోంది.
పూర్వ వైభవం తీసుకురావాలి
మార్కెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలంటే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అనుభవం కలిగిన పూర్తిస్థాయి ప్రత్యేక గ్రేడ్ కార్యదర్శిని నియమించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. సిబ్బందికి స్పష్టమైన విధులు కేటాయించి, కొనుగోళ్లు, తూకాలు, రైతులకు కల్పించే సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే ఈ మార్కెట్‌లో రైతుల ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయం రెండూ దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివాదాలు.. పర్యవేక్షణ లోపాలు
గతంలో సీసీఐ పత్తి కొనుగోళ్ల సమయంలో లోటుపాట్లపై ఆరోపణలు రావడంతో అప్పటి కార్యదర్శిని బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత కూడా మార్కెట్‌లో పర్యవేక్షణ లోపాలు, క్రయవిక్రయాల నిర్వహణపై వివాదాలు, పరస్పర ఆరోపణ లు కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. అయి తే మార్కెట్‌కు సంబంధించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది.
మార్కెట్‌కు ఏటా రూ.7.40 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా, ప్రస్తుత నెలకు రూ.1.15 కోట్ల డిమాండ్ ఉండి, రూ.92 లక్షల వసూళ్లు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదాయాన్ని మరింత పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషించడం, వ్యాపార లావాదేవీలను క్రమబద్ధీకరించడం, రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక కార్యాచరణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ విస్తీర్ణం.. విస్తృత కార్యకలాపాలు
మార్కెట్ పరిధిలో 52 మంది ట్రేడర్లు, 32 మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. వానాకాలం, యాసంగి ధాన్యం కొనుగోళ్లతో పాటు పత్తి క్రయవిక్రయాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ రెండు పంటల సాగు మధ్యలో వచ్చే కత్తెర పంట సాగు సుమారు 30 నుంచి 40 వేల ఎకరాల్లో ఉండటంతో సీజన్‌కు నెల రోజుల ముందునుంచే మార్కెట్ ధాన్యం రాశులతో కళకళలాడుతుంది. మార్కెట్ పరిధిలో 40కి పైగా రైస్‌మిల్లుల కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఇంతటి విస్తృతమైన వ్యవస్థను పర్యవేక్షించేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడం గమనార్హం.


