● జిల్లాస్థాయి కిసాన్ మేళాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వరి పంటపైనే ఆధారపడకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను అవలంబించాలని, పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ స్టేడియంలో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కిసాన్ మేళా నిర్వహించారు. కిసాన్ మేళాలో ఏర్పాటు చేసిన సుమారు 50 స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాడి పరిశ్రమ, పశుపోషణ, ఉద్యాన, మత్స్య రంగాల ద్వారా అదనపు ఆదాయ వనరులు పెంపొందించుకోవాలన్నారు. కంది, పెసర, మినుము, వేరుశనగ, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలతో పాటు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించుకోవాలని తెలిపారు. కలెక్టరేట్ పరిసరాల్లో సుమారు 2 ఎకరా ల్లో ఉద్యాన తోటలు, కూరగాయలు, కంది, తదితర పంటలను సాగు చేస్తున్నామని చెప్పారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మాట్లాడుతూ.. నాలుగేళ్లలో జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టినట్లు వివరించారు. మొక్కలపై 90 శాతం సబ్సిడీ కల్పిస్తున్నట్లు ఈ సంవత్సరం ఆయిల్‌పామ్ సాగు నిర్వహణకు సంబంధించి రూ.2.11 కోట్ల సబ్సిడీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. చౌడు భూముల్లో ఆక్వాకల్చర్ చేపట్టేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులు, ఆత్మ కమిటీ చైర్మన్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో జనగామ ఆత్మ కమిటీ చైర్మన్ బి.మహేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఆత్మ కమిటీ చైర్మన్ బి.పెద్దిరెడ్డి, పాలకుర్తి ఆత్మ కమిటీ చైర్మన్ ఇ. రాఘవరావు, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీఆర్డీఓ భాస్కర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మురళీధర్ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్య, మత్స్య శాఖ అధికారి రాణా ప్రతాప్, భూగర్భ జల శాఖ అధికారి నరసింహులు, జెడ్పీ సీఈఓ బాలరామ రావు, ఎల్డీఎం ప్రతిభ, విజయ డెయిరీ డీడీ గోపాల్ సింగ్, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.


